టెస్లా సైబర్ ట్రక్ పేలుడు ఘటన.. నిందితుడి లేఖలో సంచలన విషయాలు

నూతన సంవత్సర వేడుకల వేళ అగ్రరాజ్యం అమెరికాలో పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-04 06:11 GMT

నూతన సంవత్సర వేడుకల వేళ అగ్రరాజ్యం అమెరికాలో పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి.. లాస్ వెగాస్ లోని ట్రంప్ హోటల్ వెలుపల టెస్లా సైబర్ ట్రక్ పేలుడు ఘటన. దీనిపై ఇప్పటికే ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమయంలో.. ఆ పేలుడుకు కారణమైన నిందితుడు మొబైల్ లో రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అవును... లాస్ వెగాస్ లోని ట్రంప్ హోటల్ వెలుపల టెస్లా సైబర్ ట్రక్ ను పేల్చివేసిన తర్వాత మరణించిన యూఎస్ ఆర్మీ సైనికుడు మాథ్యూ లివెల్స్ బెర్గర్ మొబైల్ లో రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మాథ్యూ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా.. ‘దేశ రుగ్మతకు ఇదొక మేల్కొలుపు’ అని అతడు రాశాడు.

ఇదే సమయంలో... ఇది ఉగ్రవాద చర్య ఏమాత్రం కాదని మాథ్యూ లేఖలో పేర్కొన్నాడు. ఇదే సమయంలో... తన సోదరులను కోల్పోయిన నేపథ్యంలో తన మనసులోని భారాన్ని దించుకోవడానికి, కాస్త ఉపశమనం పొందడానికి ఈ పనికి పూనుకున్నానని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో... అమెరికన్లు ఏదైనా విధ్వంసం జరిగితేనే స్పందిస్తారని, అందువల్ల తాను ఈ ఆప్షన్ ఎంచుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. అదేవిధంగా.. అమెరికా ప్రస్తుతం అత్యంత అనారోగ్యంతో ఉందని.. పతనం వైపు వెళ్తుందని తన లేఖలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ లేఖను అధికారులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన పరిశీలకులు.. మాథ్యూ లేఖలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సహా రాజకీయ మనోవేదనలు, సామాజిక సమస్యలపై ఆందోళనలతోపాటు అంతర్జాతీయ సమస్యల పట్ల దృష్టి సారించాయని చెబుతున్నారు. ఇదే సమయంలో... ట్రంప్ పట్ల మాథ్యూ లివెల్స్ బర్గర్ ఎలాంటి దురుద్దేశాన్ని కలిగి లేడని లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.

కాగా... గెరిల్లా యుద్ధం, సాంప్రదాయేతర పోరాట వ్యూహాల్లో అత్యంత ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక దళం యూఎస్ ఆర్మీ గ్రీన్ బెరెట్ లో మాథ్యూ లివెల్స్ బెర్గర్ అత్యంత యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు. అతడు ఇప్పటికే ఆఫ్గన్, ఉక్రెయిన్, జార్జియా, తజికిస్తాన్, కాంగో దేశాల్లో పనిచేసినట్లు చెబుతున్నారు.

తాజాగా నూతన సంవత్సర వేడుకల వేళ లాస్ వెగాస్ లో పేలుడు సమయంలో అతడు సెలవులో ఉన్నారని.. ఇటీవలే జర్మనీలో విదేశీ అసైన్ మెంట్ నుంచి అతడు తిరిగి వచ్చాడని చెబుతున్నారు.

Tags:    

Similar News