బాబులో ఆ గుణం గ్రేట్ ...తమ్ముళ్ళు మాత్రం...!
అధికారం చేతిలో ఉంది. ఏది అయినా చేయవచ్చు. వచ్చే పరిణామాలు పర్యవసానాలు ఆనక చూసుకోవచ్చు. ఇది ఒక రకం నేతలు ఆలోచించే తీరు.
అధికారం చేతిలో ఉంది. ఏది అయినా చేయవచ్చు. వచ్చే పరిణామాలు పర్యవసానాలు ఆనక చూసుకోవచ్చు. ఇది ఒక రకం నేతలు ఆలోచించే తీరు. అధికారం ఎంత బలంగా చేతిలో ఉన్నా చేసే పనులు కాల పరీక్షకు నిలవాలి. రేపటి జనం కూడా మెచ్చాలి. పైగా ఈ రోజు మనది అయిందని చేసుకుంటూ పోతే రాజకీయాల్లో ఇచ్చే సందేశం ఏమిటి అని ఆలోచించే వారు మరికొందరు.
టీడీపీ అధినేత చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన రెండవ కోవ లోకే వస్తారు. చంద్రబాబు సీఎం అయి ఏడు నెలలు పూర్తి అవుతున్నాయి. కానీ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపుల విషయంలో మాత్రం జోరు చూపించడం లేదు అనే అంటున్నారు. ఆయనను నిండు అసెంబ్లీలో అవమానించిన వారిని సైతం ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు అని గుర్తు చేస్తున్నారు. బాబుకు అధికారం దక్కితే ఫలానా వారి పని సరి అని జరిగిన ప్రచారంలో నిజం పెద్దగా లేదని తేలిపోతోంది.
నిజానికి చంద్రబాబులో అసలైన రాజకీయ నాయకుడు ఉన్నారని అంటారు. ఆయన ఎవరి మీద కక్ష పెంచుకోరు. ఆయన కసి పట్టుదల అంతా కూడా అధికారంలోకి వచ్చిన తరువాత జనం మెప్పు పొంది మళ్ళీ పవర్ ఎలా దక్కించుకోవాలి అన్న దాని మీదనే ఉంటుందని అంటారు. కక్షలు కార్పణ్యాలతో పోతే చివరికి జరిగేది ఒరిగేది ఏదీ ఉండదని కూడా బాబు ఆలోచిస్తారు అంటారు.
అందుకే చాలా వరకూ తమ్ముళ్ల జోరుకు ఆయన కళ్ళెం వేస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ నాయకులు క్యాడర్ నుంచి అయితే ఒత్తిడి పెద్ద ఎత్తున వస్తోంది. వారిని అరెస్ట్ చేయించండి వీరి మీద కేసులు పెట్టించండి అని అంటూ డిమాండ్లూ వస్తూంటాయి. అది సహజం. అయిదేళ్ళ పాటు వైసీపీ ఏలుబడిలో తీవ్రంగా నలిగిన పార్టీ నేతలు శ్రేణులు అదే కోరుకుంటారు.
కానీ బాబు మాత్రం విజ్ఞతతో ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. లేటెస్ట్ గా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి పేర్ని నాని మీద విమర్శలు చేస్తూ చంద్రబాబు మీద చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ రోజున వైసీపీ వారిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మా పెద్దాయన చంద్రబాబు దానికి ఒప్పుకోరు అని జేసీ అన్నారు.
గత అయిదేళ్ల వైసీపీ పాలనలో తాము ఎన్నో విధాలుగా అవస్థలు పడ్డామని వాటిని గుర్తు తెచ్చుకుంటే బాధాకరంగా ఉంటుందని అన్నారు. తమను ఆనాడు ఇళ్ళలో నుంచి బయటకు రానీయలేదని కానీ ఈ రోజున వైసీపీ వారు రోడ్డు మీద తిరుగుతున్నారని వారు బాగానే ఉంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దానికి కారణం బాబు కక్ష పూరిత రాజకీయాలకు దూరంగా ఉండబట్టే అని ఆయన అంటున్నారు.
బాబు గురించి జేసీ అన్నారని కాదు నిన్నటికి నిన్న మాజీ మంత్రి కరడు కట్టిన వైసీపీ నేత పేర్ని నాని కూడా ఇదే విషయం చెప్పారు. ఇంట్లో మహిళల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయవద్దు అని బాబు తమ పార్టీ వారికే చెప్పారని తనకు సమాచారం ఉందని చెబుతూ బాబులో ఆ గుణం గ్రేట్ అని పొగిడారు.
నిజంగా రెడ్ బుక్ అని వైసీపీ నేతలు ఒకటికి పదిసార్లు అంటూ ఉంటారు కానీ ఏ బుక్ అయినా అమలు చేయకుండా అడ్డుకుంటోంది చంద్రబాబే అని అంటున్నారు. ఆయన ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వరని కూడా చెబుతున్నారు. ఏపీలో పాలన మంచిగా సాగాలన్న ఉద్దేశ్యంతోనే బాబు ఉన్నారని కూడా గుర్తు చేస్తున్నారు.
అయితే వైసీపీ మీద ఆ పార్టీ అయిదేళ్ళలో తమ మీద చేసిన అఘాయిత్యాల మీద మండిపోతున్న గ్రౌండ్ లెవెల్ క్యాడర్ మాత్రం లోకేష్ బాబు అయితేనే వైసీపీకి కరెక్ట్ అంటోంది. ఆయన కనుక దూకుడు చేస్తే వైసీపీ వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతామని కూడా అంటున్నారు.
మొత్తానికి చూస్తే కనుక బాబు సహనంతో సంయమనంతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అని అర్థం అవుతోంది. ఆయన జగన్ బర్త్ డే వేళ కూడా ఆయనకు గ్రీట్ చేయడం ఇందులో భాగమే అంటున్నారు. పెద్దాయనగా సీనియర్ నేతగా ఉన్న బాబు నుంచి ఈ క్వాలిటీస్ నేర్చుకుంటే ఏపీలోని మిగిలిన నాయకులు కూడా బాగానే ఉండగలుగుతారని అపుడు ఏపీ కూడా కక్షలు కావేశాలు లేని రాష్ట్రంగా మారుతుందని అంటున్నారు.