టీడీపీకి శరాఘాతంగా జనసేన మాటలు
అటువంటి టీడీపీకి మిత్రపక్షంగా జనసేన ఉండి ఆ పార్టీ విజయంలో కొంత చేయూత ఇవ్వవచ్చు కానీ తామే నిలబెట్టామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి.;
తెలుగుదేశం పార్టీ తెలుగు నాట సుస్థిరమైన ఖ్యాతి గడించిన పార్టీ. ఆ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ అప్పటికి మూడు దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ ని కూకటి వేళ్ళతో పెకిలించి అధికారంలోకి రావడం రాజకీయంగా ప్రపంచ చరిత్ర.
దాని సృష్టికర్త దివంగత ఎన్టీఆర్. ఇక టీడీపీకి ఇలాంటి రికార్డులు ఎన్నో ఎన్టీఆర్ అందించి వెళ్ళారు. ఆయన ఏడున్నర ఏళ్ళ పాటు సీఎం గా పనిచేసారు. ఆ తరువాత తనదైన రాజకీయ చతురతతో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని గత మూడు దశాబ్దాలుగా భుజాన మోస్తున్నారు. బాబు సీఎం గా ఇప్పటికి నాలుగు సార్లు అయ్యారు. ఈ టెర్మ్ తో కలుపుకుంటే ఆయన రెండు దశాబ్దాల పాటు సీఎం గా పనిచేసిన చరిత్రను క్రియేట్ చేసిన వారు అవుతారు. బాబు రికార్డు మరొకరికి సాధ్యం అయ్యేది కూడా కాదు.
తెలుగుదేశానికి బలమైన రాజకీయ సైద్ధాంతిక భూమిక ఉంది. అంతే కాదు ఎంతటి ఓటమిలో అయినా చెక్కు చెరదని నలభై శాతం పైగా ఓటు షేర్ ఉంది. పార్టీకి కత్తుల్లాంటి క్యాడర్ ఉంది. నిబద్ధత కలిగిన నేతలు వేలాదిగా ఉన్నారు. అటువంటి టీడీపీకి మిత్రపక్షంగా జనసేన ఉండి ఆ పార్టీ విజయంలో కొంత చేయూత ఇవ్వవచ్చు కానీ తామే నిలబెట్టామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన కామెంట్స్ ని టీడీపీ శ్రేణులు అయితే అసలు తట్టుకోవడం లేదు. వారు మండిపోతున్నారు. జనసేన ఆవిర్భావం వేళ పవన్ కి చంద్రబాబు లోకేష్ శుభాకాంక్షలు చెబితే ఆ పార్టీ నేతలు ఈ విధంగా మాట్లాడటం ఏమిటి అన్న చర్చ అయితే సాగుతోంది.
ఈ సభలో పవన్ నాగబాబు చేసిన కామెంట్స్ మీద సోషల్ మీడియాలో టీడీపీ యాక్టివిస్టులు రగిలిపోతున్నారు. టీడీపీ వయసు నలభయ్యేళ్ళ పై మాట అని పవన్ కి గుర్తు చేస్తున్నారు. టీడీపీని నిలబెట్టింది ఎపుడూ కార్యకర్తలే అని వారు సోషల్ మీడియా వేదికగా ఎటాక్ చేస్తున్నారు. అంతే కాదు పొత్తులో ఉన్నామని మాట్లాడేటపుడు తగిన విధంగా వ్యవహరించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
కూటమికి అధికారం దక్కడం తమ దయా ధర్మం అని జనసేన నేతలు ఇటీవల కాలంలో మాట్లాడడం పట్ల కూడా టీడీపీలో అంతర్మధనం సాగుతోంది. క్యాడర్ అయితే అసలు దీనిని స్పేర్ చేయడం లేదు అని అంటున్నారు. కూటమి విజయం సమిష్టిది అని అంతా కలసి గెలిచామని చెబితే హుందాగా ఉంటుంది కానీ మేమే గెలిచామని మేమే అందరినీ గెలిపించామని చెప్పడం వల్ల రచ్చ తప్ప ఒరిగేది ఏముంటుందని అంటున్నారు.
జనసేన నేతలు కొందరు అహంకారంపూరితంగా మాట్లాడుతున్నారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా అంటున్నాయి. నిజానికి టీడీపీ మద్దతు ఉండబట్టే పవన్ సహా జనసేన ఎమ్మెల్యేలు అంతా గెలిచారు అని వారు చురకలు వేస్తున్నారు. 2019 ఎన్నికల గురించి కూడా ప్రస్తావిస్తూ జనసేన షాకింగ్ రిజల్ట్ ని తెర మీదకు తెస్తున్నారు. మొత్తానికి చూస్తే జనసేన నేతల మాటలు టీడీపీకి శరాఘాతంగాన తగిలాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.