భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందా?
మోడీ కలలుగన్న భారతం ఆవిష్కృతం కావడానికి ఇంకా కేవలం మూడేళ్లే ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్ 3 గా నిలవడం ఖాయమని అంచనాలు వచ్చేశాయి.;
మోడీ కలలుగన్న భారతం ఆవిష్కృతం కావడానికి ఇంకా కేవలం మూడేళ్లే ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో టాప్ 3 గా నిలవడం ఖాయమని అంచనాలు వచ్చేశాయి. అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, రాబోయే కొన్నేళ్లలో అనూహ్యమైన వృద్ధిని సాధిస్తుందని మోర్గాన్ స్టాన్లీ ఆశాభావం వ్యక్తం చేసింది. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం, 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5.7 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ. 495 లక్షల కోట్లు) చేరుకుంటుంది. ఇది 2023లో ఉన్న 3.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి గణనీయమైన పెరుగుదల. అంతేకాకుండా, 2026 నాటికే భారత ఆర్థిక వ్యవస్థ 4.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకొని ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఈ స్థానంలో జర్మనీ ఉంది. దీంతో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలవనుంది.
గత కొన్ని దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన మార్పులు చెందింది. 1990లో ప్రపంచంలో 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, 2000 నాటికి 13వ స్థానానికి దిగజారింది. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని 2020 నాటికి 9వ స్థానానికి, 2023 నాటికి ఏకంగా 5వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 3.5 శాతంగా ఉండగా, 2029 నాటికి ఇది 4.5 శాతానికి పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది.
భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి అనేక కారణాలను మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. వాటిలో ముఖ్యమైనవి:
అత్యంత ఆకర్షణీయమైన వినియోగ మార్కెట్: భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగ మార్కెట్‌గా అవతరిస్తోంది. పెరిగిపోతున్న మధ్యతరగతి ప్రజలు, వారి కొనుగోలు శక్తి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయి.
ప్రపంచ ఉత్పాదకతలో పెరుగుతున్న వాటా: ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి రంగం మారుతున్న నేపథ్యంలో, భారతదేశం తన ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతుంది.
విధానపరమైన మద్దతుతో స్థూల ఆర్థిక స్థిరత్వం: ప్రభుత్వం తీసుకుంటున్న సరైన ఆర్థిక విధానాలు దేశంలో స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పాయి. ఇది పెట్టుబడులను ఆకర్షించడానికి సహాయపడుతుంది.
మెరుగైన మౌలిక వసతులు: భారతదేశంలో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు వంటి వాటిలో జరుగుతున్న అభివృద్ధి ఆర్థిక కార్యకలాపాలను మరింత సులభతరం చేస్తుంది.
మూడు రకాల వృద్ధి ధోరణులు:
మోర్గాన్ స్టాన్లీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మూడు రకాలుగా వర్గీకరించింది:
బేర్ దశ: ఈ దశలో ప్రస్తుతమున్న 3.65 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ 2035 నాటికి 6.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుంది. తలసరి జీడీపీ 2025లోని 2,514 డాలర్ల నుంచి 2035 నాటికి 4,247 డాలర్లకు చేరుతుంది.
బేస్ దశ: ఇది మధ్యస్థ వృద్ధి దశ. ఈ అంచనా ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ 2035 నాటికి 8.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుంది. తలసరి జీడీపీ 5,683 డాలర్లకు పెరుగుతుంది.
బుల్ దశ: ఇది అత్యంత ఆశాజనకమైన దృష్టాంతం. ఈ దశలో భారత ఆర్థిక వ్యవస్థ 2035 నాటికి 10.3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు. తలసరి జీడీపీ 6,706 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది.
మరో పావు శాతం రెపో రేటు తగ్గింపు ఖాయం:
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధానాన్ని క్రమంగా సడలిస్తోందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున, ఏప్రిల్ నెలలో జరిగే సమీక్షలో RBI మరో 0.25 శాతం రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని తెలిపింది. ఇదివరకే ఫిబ్రవరి సమీక్షలో RBI పావు శాతం రెపో రేటును తగ్గించిన విషయం తెలిసిందే.
మోర్గాన్ స్టాన్లీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 6.5 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. గత కొద్ది వారాల్లో ఆర్థిక సూచికలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, రెండు నెలల క్రితంతో పోలిస్తే పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని నివేదిక తెలిపింది. రాబోయే కాలంలో ఆర్థిక పునరుద్ధరణ విస్తృతంగా ఉంటుందని, బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపు పన్ను తగ్గింపులు పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచుతాయని భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ మరియు గృహ రంగాల పెట్టుబడులు వృద్ధికి ప్రధానంగా దోహదం చేస్తున్నాయని, కార్పొరేట్ పెట్టుబడులు కూడా క్రమంగా పెరుగుతున్నాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.
మొత్తంగా మోర్గాన్ స్టాన్లీ అంచనాలు భారత ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తున్నాయి. సరైన విధానాలు , ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటే, రాబోయే కొన్నేళ్లలో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.