ఏడాది మొదటి రోజే చంద్రబాబు స్పెషల్ వార్నింగ్

ఆట మొదలైందని.. ఎవరినీ వదిలిపెట్టబోనంటూ స్పష్టమైన ప్రకటన చేయటం గమనార్హం. 'గేమ్ స్టార్ అయ్యింది. సోషల్ మీడియా వ్యవహారంలో మీరు చూశారు కదా.

Update: 2025-01-02 04:47 GMT

కొత్త ఏడాది. మొదటి రోజునే కీలక వ్యాఖ్య ఒకటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి వచ్చింది. రివేంజ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటారన్న పేరు చంద్రబాబుకు ఉంది. అయితే.. గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయనకు.. తన పొలిటికల్ కెరీర్ లో ఎప్పుడూ ఎదురుకాని ప్రతికూల పరిస్థితులు ఎదురు కావటమే కాదు.. చివరకు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో తాను మారిన మనిషినని.. తనలో మార్పు చూస్తారని ఆయన చెప్పేవారు.

కొన్ని ఘటనల వేళ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థుల సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే.. సీఎం అయ్యాక.. అలాంటి పరిస్థితి లేదని.. చివరకు వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపైనా సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా.. కొత్త ఏడాది మొదటి రోజున మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. ప్రత్యర్థులకు సరికొత్త వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ఆట మొదలైందని.. ఎవరినీ వదిలిపెట్టబోనంటూ స్పష్టమైన ప్రకటన చేయటం గమనార్హం. 'గేమ్ స్టార్ అయ్యింది. సోషల్ మీడియా వ్యవహారంలో మీరు చూశారు కదా. మిగితా కేసులు కూడా అలానే డీల్ చేస్తాను. కేడర్ ఉద్దేశ్యం ఒకలా ఉంది. నా లక్ష్యం వేరుగా ఉంది. నేను జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కొంతమందికి మిసరబుల్ ట్రీట్ మెంట్ ఉంటుందని అన్నా. ఆ మాట నాకు గుర్తుంది. ఆ మాటకు కట్టుబడి ఉంటా. అయితే.. నేను రాజకీయ కక్ష తీర్చుకోను. తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టేది లేదు" అంటూ సూటిగా చెప్పేశారు.

తాను అందరి అభిప్రాయాలు తీసుకుంటానని.. అదే సమయంలో అవతలివారు చేసినట్లుగా తాను చేయలేనన్న చంద్రబాబు.. 'చట్టం.. న్యాయం ప్రకారం చేస్తా. నేను ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు. మా కేడర్, నాయకులు లేదా అధికారులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను పిలిచి అందరితో మాట్లాడుతున్నాను. అందరినీ కరెక్ట్ చేస్తాను" అంటూ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలిచేలా ఉండాలని చెప్పారు. 2004 లో నన్ను ఎవరూ ఓడించలేరని తాను అనుకున్నానని.. దీనికి కారణం.. హైదరాబాద్‌ను ఎన్నడూ లేని విధంగా డెవలప్ చేశానని చెప్పారు. కానీ, ప్రజలకు ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయలేకపోయినట్లుగా ఒప్పుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రజలకు చెప్పి ముందుకు వెళ్లాలని చెప్పటం చూస్తే.. చంద్రబాబులో మారిన మనిషి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News