'కదిలే' కష్టజీవులకు సీబీఎన్ భరోసా!
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి నడియాడే తిరుమల క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అని తెలిసిందే.
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి నడియాడే తిరుమల క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అని తెలిసిందే. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ లక్షలాది హిందూ భక్తులు దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు ఎన్ని కష్టాలైన పడుతుంటారు. తిరుమల కొండ ఎక్కితే చాలు తమ కష్టాలు కడతేరిపోతాయని భావిస్తారు.
తిరుమల కొండపై ఎటు చూసినా భక్తపారవశ్యం పొంగిపొర్లుతుంది. అక్కడ గడిపే సమయం కలకాలం గుర్తుండిపోతుంది. స్వామివారి సేవలో తరించడానికి భక్తజీవులు తహతహలాడుతుంటారు. స్వామివారిని కాలినడకన వెళ్లి దర్శించుకుంటే సకల పాప హరణం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. అందుకే అలిపిరి నుంచి మెట్ల మార్గంలో కాలినడకన భక్తులు బయలుదేరుతుంటారు. కాలినడకన వెళ్లే భక్తులు గోవిందా నామస్మరణ చేసుకుంటూ వెళ్తుంటే.. ఆ శ్రావ్యమైన ధ్వనులు సప్తగిరుల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. తిరుమల క్షేత్ర దర్శనంలో కాలినడక దర్శనానికి అంతటి ప్రాధాన్యం ఉంది.
స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అలిపిరి వద్ద కాలినడక మొదలుపెడతారు. పిల్లాపాపలతో కలిసి ఒక్కొక్క మెట్టును మొక్కుకుంటూ ఉత్సాహంగా యాత్ర ప్రారంభిస్తారు. గోవిందుడిని స్మరించుకుంటూ అదిగో..అల్లదిగో అంటూ వెంకన్న దర్శనానికి ఎత్తైన కొండలను అధిరోహిస్తూ పయనిస్తుంటారు. వేలాది భక్తులు మెట్ల మార్గంలో కాలినడక యాత్రలో వీరికి నీళ్లు, ఆహార పదార్థాలు, ఇతర చిరుతిళ్లు అందించేందుకు చిరు వ్యాపారులు సైతం ఉంటారు. వీరు తమ సరుకులు అమ్మడానికి నిత్యం భక్తులతో పాటు కొండపైకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు.
ఎంతో కష్టమైన తిరుమల కొండను ఒక్కసారి ఎక్కడానికి భక్తులు చెమటోడ్చాల్సి వస్తుంటుంది. అయితే ఈ చిరువ్యాపారులు ప్రతీ రోజు కిందికి మీదకు సాధారణంగా నడుస్తూనే ఉంటారు. వీరి గురించి తాజాగా బీబీసీ ఓ ప్రత్యేక కథనాన్ని వీడియో రూపంలో విడుదల చేసింది. దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ అలిపిరి చిరువ్యాపారుల కష్టాన్ని చూసి చలించిపోతున్నారు. వారిలో కొందరు మాట్లాడిన తీరు, తమ కష్టాన్ని వెల్లబుచ్చుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భక్తులకు ఆహార పదార్థాలు అమ్మడానికి తాము రోజూ ఎంతో కష్టాన్ని అనుభవించాల్సి ఉంటుందని, కానీ దాన్ని ‘బరువు’ అనుకోమని, తమ ‘బాధ్యత’ అనుకుంటామని చెప్పడంపై.. వారి సేవలను నెటిజన్లు కొనియాడుతున్నారు.
అలిపిరి చిరు వ్యాపారులు పడుతున్న కష్టం..ప్రతీ హృదయాన్ని తాకుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అలిపిరి చిరు వ్యాపారులకు సహకారం అందిస్తామని, వారి సంక్షేమానికి భరోసా కల్పిస్తామని ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సీఎం నిర్ణయం అభినందనీయమని, రాష్ట్రంలో ఇలాంటి కష్టజీవులకు సాయాన్ని అందించాలని ఆశిస్తున్నారు.