విడివిడిగా ఢిల్లీకి బాబు పవన్...కీలక భేటీలేనా ?
ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలూ విడివిడిగా ఢిల్లీకి రావడం విశేషం.;
ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలూ విడివిడిగా ఢిల్లీకి రావడం విశేషం. ఈ ఇద్దరూ ఢిల్లీలో ఒక కార్యక్రమం కోసం వచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి రిసెప్షన్ ఆహ్వానం మేరకు వారు వచ్చారు.
ఈ ఫంక్షన్ లో అనేక మంది బీజేపీ ఎన్డీయే మిత్రులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా రావడం విశేషం. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బిల్ గేట్స్ ని కూడా కలుస్తారు అని తెలుస్తోంది. ఆయన వీలైతే పలువురు కేంద్ర మంత్రులతోనూ కలసి రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాల మీద చర్చిస్తారు అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర మంత్రులను కలుస్తారు అని అంటున్నారు. ఆయన తన శాఖకు సంబంధించిన అంశాలతో పవన్ కళ్యాణ్ వారి వద్దకు వెళ్తారని చెబుతున్నారు. అయితే పవన్ చంద్రబాబు విడిగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళినా ఇద్దరు నేతలూ కలసి కూడా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేంద్ర మంత్రులను ఇద్దరూ కలసి భేటీలు వేయవచ్చు అని వినవస్తోంది.
ఏపీకి సంబంధించిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగులో వేళ బడ్జెట్ సెషన్ పార్లమెంట్ లో నడుస్తున్న వేళ సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్ళడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయంగా కూడా ఇది చర్చకు వస్తోంది. గత నెల ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న బాబు పవన్ ఇపుడు మరోసారి విడివిడిగా కలివిడిగా ఢిల్లీ టూర్ చేయడంతో జాతీయ మీడియా ఫోకస్ కూడా ఈ వైపుగా పడుతోంది.
మరి ఢిల్లీ నుంచి ఏపీకి ఏ శుభవార్తలు మోసుకుని వస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మిత్రులుగా ఉన్న బాబు పవన్ కేంద్రం నుంచి భారీ సాయాన్నే తీసుకుని రావాలని ఏపీకి చెందిన పార్టీలతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు.