ఈ ఇష్యూ సీరియస్ గా తీసుకోవాల్సిందే చంద్రబాబు
అది కూడా ఒక ప్రేమజంటను బెదిరించి.. అత్యాచారానికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది.
కొన్నిసార్లు అనూహ్యంగా చోటు చేసుకునే దారుణాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించటంతో పాటు.. సీరియస్ గా స్పందించటం.. అది కూడా వెంటనే అన్నట్లు ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఏపీలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఒక యువతిపై హోంగార్డు ఒకరు అత్యాచారానికి పాల్పడిన దారుణం చోటు చేసుకుంది. అది కూడా ఒక ప్రేమజంటను బెదిరించి.. అత్యాచారానికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది.
బాధితురాలి కంప్లైంట్ తో ఈ అమానుష ఘటన వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. బొండపల్లి పోలీసుస్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తుంటాడు మొయిద సురేశ్. మంగళవారం సాయంత్రం తన డ్యూటీ ముగిసిన తర్వాత టూవీలర్ మీద ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో కొండకరకం సమీపంలో అతడికి ఒక ప్రేమజంట కనిపించింది. దీంతో.. వారి వద్దకు వెళ్లి.. తాను ఎస్ఐ అని ఏం చేస్తున్నారంటూ గద్దించాడు.
దీంతో భయపడిపోయిన ప్రియుడు పారిపోయాడు. ఆ అమ్మాయిని వారి సొంతూరుకు బస్సు ఎక్కిస్తానని చెప్పి తన బైకు మీద రామతీర్థం వైపు తీసుకెళ్లాడు. అక్కడి చంపావతి నది ఒడ్డున ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి ఆమెను రామతీర్థం కూడలి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
తాను చేసిన తప్పుడు పని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తనకు జరిగిన అన్యాయంపై నెల్లిమర్ల పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడు సురేశ్ ను అరెస్టు చేసినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. అతడ్ని విధుల నుంచి శాశ్వితంగా తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇలాంటి ఉదంతాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటే.. చర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని చేతల్లో చూపించాల్సిన అవసరం ముఖ్యమంత్రిచంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీద ఉంది. ఎందుకుంటే.. జగన్ ప్రభుత్వంలోనూ ఇలాంటి ఘటనలపైనా వీరిద్దరూ స్పందించారు. తమ ప్రభుత్వంలో జరిగిన ఈ వైనంపై స్పందించి.. చర్యలకు అత్యంత కఠినంగా ఉండేలా చేస్తే.. గతంలో వీరు చెప్పిన మాటలకు అర్థం ఉంటుందని చెప్పాలి.