జగన్ గురించి జనాలకు బాబు చెప్పిన మాట !
అన్ని విధాలుగా దివాళా తీసిన రాష్ట్రాన్ని తాను గాడిన పెట్టే పనిలో ఉన్నాను అని బాబు చెప్పారు.
జగన్ గురించి పేరు ఎత్తకుండా ఉత్తరాంధ్రా పర్యటనలో చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. అయిదేళ్ళ విధ్వంస పాలన చేసి ఏపీని అప్పుల కుప్ప చేసారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. అన్ని విధాలుగా దివాళా తీసిన రాష్ట్రాన్ని తాను గాడిన పెట్టే పనిలో ఉన్నాను అని బాబు చెప్పారు.
ఏపీ పునర్ నిర్మాణంలో అంతా సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. ఇదిలా ఉంటే జగన్ ని పట్టుకుని నార్త్ కొరియా కిమ్ తో పోల్చారు. ఈయన ఏపీకి కిమ్ అని విమర్శించారు. సీఎం గా ఉన్నపుడు పరదాలు కట్టుకుని చెట్లు కొట్టించి షాపులు మూయించి జగన్ చేసిన హడావుడి అంతా ఇతా కాదని అన్నారు.
దాని వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తనకు బాగా తెలుసు అన్నారు. జగన్ ఓటమి చెందాకనే ప్రజలకు వాక్ స్వాతంత్రం వచ్చిందని కూడా చంద్రబాబు చెప్పారు. తాను గతంలో కూడా ఉత్తరాంధ్ర పర్యటనకు అనేక సార్లు వచ్చానని అయితే ఈసారి సీఎం గా వచ్చానని ప్రజల ముఖాలలో ఒక రకమైన ఆనందం చూస్తున్నాను అని చంద్రబాబు అన్నారు.
ఏపీకి ఉపాధి కల్పన అభివృద్ధి అజెండాగా చేసుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు. అనేకమంది పెట్టుబడిదారులను కలుస్తున్నామని పారిశ్రామికవేత్తలను కూడా ఏపీకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. అయితే చాలా మంది పారిశ్రామికవేత్తలు గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయారని ఇపుడు కూడా చాలా మంది సంశయిస్తున్నారు అని చంద్రబాబు అన్నారు.
దానికి కారణం ఏపీలో ఒక భూతం ఉందని వారు భయపడుతున్నారని అన్నారు. మళ్లీ తాము పెట్టుబడులు పెడితే ఆ భూతం కనుక వస్తే ఎలా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. అయితే ఆ భూతాన్ని భూస్తాపితం చేస్తామని బాబు అన్నారు. ఒక సీసాలో బంధించి మళ్లీ బయటకు రాకుండా చేస్తామని అన్నారు.
ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించాలని ఆయన కోరారు. వైసీపీ చెప్పే తప్పుడు మాటలు వినవద్దు అని వారు ఎపుడైనా వస్తే నిలదీయాలని కోరారు. మొత్తం మీద చూస్తే జగన్ అయిదేళ్ల పాలన వల్ల రాష్ట్రం సర్వ నాశనం అయిందని మళ్ళీ ఆయనకు చాన్స్ ఇవ్వవద్దని బాబు కోరుతున్నట్లుగా ఉంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం మొదలెట్టిన అభివృద్ధి శాశ్వతంగా ఉండాలంటే జగన్ శాశ్వతంగా అధికారానికి దూరంగా ఉండాలని ఆయనను అలా ఉంచాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే వివిధ రంగాలకు సంబంధించి శ్వేత పత్రాలను రిలీజ్ చేసిన సందర్భంగా చంద్రబాబు ఆయా రంగాలలో అంతా వినాశనం జరిగింది అని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం మూలంగానే ఇలా జరిగింది అని కూడా ఆయన అంటున్నారు.
మొత్తం మీద చూస్తే చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలలో ఒక విషయం ఉంది. అభివృద్ధిని ఉపాధిని కోరుకున్న వారు అవి శాశ్వతంగా ఉండాలంటే మళ్లీ వైసీపీని గెలిపించ వద్దు అన్నదే బాబు ఇస్తున్న పిలుపుగా ఉంది అని అంటున్నారు. ఈ అయిదేళ్ళ పాటే కాకుండా ఏపీలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కొనసాగాలంటే ప్రజలు మళ్లీ వినాశనం తెచ్చే వైసీపీ లాంటి వాటి వైపు చూడవద్దు అని కూడా కోరుతున్నారని అంటున్నారు.
మీడియా సమావేశాలలో ఇదే విషయాన్ని అనేక సార్లు చెప్పిన చంద్రబాబు ఇపుడు బహిరంగ సభలలో కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇది వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది కరమైన పరిస్థితి అని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ఒకసారి ఓటమి పాలు కావడం వేరు. శాశ్వతంగా ఈ పార్టీ వద్దు అన్నట్లుగా ప్రత్యర్ధి పార్టీలు చేస్తున్న ప్రచారానికి సరైన వివరణ ఇచ్చుకోకపోతే వైసీపీ రాజకీయంగా పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుంది అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే అయిదేళ్లలో వైసీపీ అన్నీ సర్వనాశనం చేసింది అన్న దానికి వైసీపీ నుంచి కౌంటర్లు రాకపోతే మాత్రం జనాలు నమ్మే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీకి ఈ రోజుకీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది. అందుకే చంద్రబాబు పదే పదే వైసీపీ గురించి ప్రజలను హెచ్చరిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ విషయంలో జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది.