కాంగ్రెస్‌లో పాత, కొత్త.. ఈ వేడి చల్లారేదెన్నడో..?

తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాటిని మరోసారి రుజువు చేశాయి.

Update: 2024-10-23 14:30 GMT

గ్రూపులకు కేరాఫ్ కాంగ్రెస్ అనే విషయం అందరికీ తెలిసిందే. దశాబ్దాలు గడుస్తున్నా కాంగ్రెస్‌లో ఆ సంస్కృతికి మాత్రం తెరపడడం లేదు. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ గ్రూపుల వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత అన్న వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఎప్పటి నుంచో నడుస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇంకా పెద్దదైంది. కొత్త వారిని తీసుకొచ్చి అందలం ఎక్కిస్తున్నారంటూ సీనియర్లు చాలా సార్లు అధిష్టానం వద్ద అసంతృప్తి వెల్లగక్కారు. సీనియర్లను కాదని జూనియర్లకు ఎలా ప్రాధాన్యం ఇస్తారంటూ చాలా సందర్భాల్లో నిలదీశారు. ఇక అప్పటి నుంచి ఆ వివాదం నడుస్తూనే ఉంది.

అయితే.. దశాబ్ద కాలం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంకా ఆ వివాదాలు సమసిపోలేదు. ఈ వివాదాలు ఒక రాష్ట్ర నేతల మధ్యనే అనుకుంటే పొరపాటే. జిల్లా, మండల స్థాయిల్లోనూ కనిపిస్తున్నాయి. సీనియర్లు, జూనియర్లు అంటూ నిత్యం దెబ్బలాడుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాటిని మరోసారి రుజువు చేశాయి. ఓ సీనియర్ నేత అయి ఉండి.. ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు తనకు వద్దని.. పార్టీ నుంచి తప్పుకొని ఏదైనా స్వచ్ఛంద సంస్థ నడుపుకుంటానని జీవన్ మాట్లాడారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను జీవన్ రెడ్డికి సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఓ ఎమ్మెల్యేను అందులోనూ తన ప్రాతినిధ్య జిల్లా ఎమ్మెల్యేను చేర్చుకుంటుంటే తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని బాధపడ్డారు. గత కొన్ని రోజులుగా పార్టీలో అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో ఈ ఒక్క ఘటనే కాదు.. కొన్ని రోజులుగా వరుసగా ఈ గ్రూప్ వార్‌లు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమన్నారు. కొండా ఫ్యామిలీ అన్ని నియోజకవర్గాలపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోందంటూ నేతలంతా ఐక్యతారాగం వినిపించారు. ఇదే విషయాన్ని పీసీసీ, ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పీసీసీ చీఫ్ హోదాలో మహేశ్ కుమార్ గౌడ్ వారందరినీ బుజ్జగించాల్సి వచ్చింది.

అంతకుముందు బాన్సువాడలో పార్టీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ అంశంపై గొడవ జరిగింది. అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య వివాదం నెలకొంది. సీనియర్ నేతగా శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వాలని పీసీసీ చీఫ్ స్వయంగా రవీందర్ రెడ్డిని ఆదేశించారు. కానీ.. ఆయన మాత్రం వాటిని పట్టించుకోలేదు. తానే ఇన్చార్జిని అని.. అన్నింటా తనకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రకటించేసుకున్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ వేదికగా మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయారెడ్డి దుర్భాషలాడుకున్నారు. ఇలా ప్రతీ జిల్లాలోనూ గ్రూపుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. సీనియర్లు, జూనియర్లు అన్న భేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ జాతీయ పార్టీలో ఈ గ్రూపు విభేదాలకు ఫుల్ స్టాప్ పడదని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News