కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు!

ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు.

Update: 2024-10-23 16:22 GMT

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దీపావళి నుంచి మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ పథకం అమలు చేస్తామని, ముందుగా లబ్ధిదారులు డబ్బులు చెల్లించి సిలిండర్ కొన్న తర్వాత 48 గంటల్లో వారి ఖాతాలో ఆ డబ్బు మొత్తం జమ అయ్యేలాగా విధివిధానాలు రూపొందించాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు.

ప్రతి ఏటా నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లు ఇవ్వాలని, ఆగస్టు వరకు ఒక సిలిండర్, నవంబర్ వరకు ఒక సిలెండర్, జనవరి వరకు ఒక సిలెండర్ ఇస్తామని చెప్పారు. నాలుగు నెలల కాలంలో ఏ సమయంలో అయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా ఏడాదికి ఖజానాపై 2700 కోట్ల భారం పడుతుందని అన్నారు. ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక ఉచితంగా తీసుకువెళ్లవచ్చని, పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేలాగా మంత్రివర్గం నిర్ణయించింది. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్ల ద్వారా ధరలు నియంత్రణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది

మరోవైపు, ఆలయ కమిటీలలో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పిస్తూ సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచుకునేలాగా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ కు గురువుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు షాక్ ఇచ్చింది కేబినెట్. శారదా పీఠానికి ఎకరా లక్ష రూపాయల చొప్పు కారు చౌకగ కట్టబెట్టిన కోట్లాది రూపాయల విలువ చేసే 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మంగళగిరిలో 100 పడకల ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

Tags:    

Similar News