చంద్ర‌బాబు అరెస్టు... అస‌లేం జ‌రిగింది? విష‌యం ఏంటి?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగిన విషయం తెలిసిందే

Update: 2023-09-09 06:16 GMT

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగిన విషయం తెలిసిందే. అయితే.. అస‌లు జ‌డ్‌+ కేట‌గిరీ భ‌ద్ర‌త, 14 ఏళ్ల‌పాటు సీఎంగా చేసిన ఉన్న‌త ప్రొఫైల్ ఉన్న నాయ‌కుడు చంద్ర‌బాబును అరెస్టు చేయ‌డానికి కార‌ణం ఏంటి? అస‌లు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు ఏంటి? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.

ఏం జ‌రిగిందంటే...

2015లో చంద్ర‌బాబు హ‌యాంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3,350 కోట్ల రూపాయల ప్రాజెక్టు(కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తిపాదిత ప్రాజెక్టు)కు ఒప్పందం కుదుర్చుకుంది. జర్మనీకి చెందిన 'సీమెన్' అనే సంస్థ ద్వారా యువతకు శిక్షణ ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వాటా చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపుల్లో ఏకంగా 240 కోట్ల రూపాయల్ని దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.

అదేవిధంగా నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌ల ద్వారా జీఎస్టీకి గండి కొట్టారనే అభియోగాలు సైతం ఉన్నాయి. దీనిపై కేంద్ర జీఎస్టీ అధికారులు సైతం కేసులు న‌మోదు చేశారు. ఇక‌, రాష్ట్రంలో అధికారం మార‌డంతో 2019 త‌ర్వాత‌.. చంద్ర‌బాబు స‌ర్కారును ఎలాగైనా ఇర‌కాటంలో పెట్టాల‌నే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

అలాగే గతంలోనే స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం 2021 జులైలో సీఐడీ విచారణకు ఆదేశించింది. అయితే ఈ సీఐడీ నివేదిక ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కూడా దృష్టి సారించింది. ఈ కేసులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌ కె.లక్ష్మీనారాయణలతో పాటు.. 26 మందిపై సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను సీఐడీ అధికారులు విచారించారు. లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు ఓఎస్డీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పనిచేశారు. అలాగే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఇక టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చారు.

ఈ క్రమంలో ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలకు కూడా చేశారు. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సీఐడీ కీలక విషయాలు నమోదు చేసింది. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని.. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది.

అయితే ఈ సొమ్మును 7 షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టెక్నాలజీ కంపెనీలు.. ప్రభుత్వానికి విభజించడంలో అవకతవకలు జరిగాయని సీఐడీ పేర్కొంది. 2017-18లో రూ.371 కోట్లలో.. రూ.241 కోట్లు గోల్‌మాల్‌ జరిగాయని సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించింది. అలాగే గతంలోనే సీఐడీ కేసులు నమోదు చేసిన 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో 240 కోట్ల వ్య‌వ‌హారానికి సంబంధించి చంద్ర‌బాబు పాత్ర కీల‌క‌మ‌ని సీఐడీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే తాజాగా చంద్ర‌బాబును అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News