'బ్రో' సినిమాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. అంబటికి చురకలు
ఈ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును వ్యంగ్యంగా పేర్కొంటూ ఒక పాట చేశారనే వివాదం కొనసాగుతోంది
పవన్ కళ్యాణ్-సాయిధరమ్‌తేజ్ సంయుక్తంగా నటించిన సినిమా బ్రో. ఈ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును వ్యంగ్యంగా పేర్కొంటూ.. ఒక పాట చేశారనే వివాదం కొనసాగుతోంది. దీనిపై ఇటు మంత్రి అంబటి విమర్శలు చేయడం, అటు నిర్మాత కూడా సమాధానం చెప్పడం అయిపోయాయి. అయితే.. తాజాగా ఈ బ్రో సినిమా వివాదంపై టీడీపీ అధినేతం చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటికి ఆయన చురకలు అంటించారు.
''మనం చేసే పనులు బాగుంటే.. సినిమాల్లోనూ బాగానే చూపిస్తారు. ఎవరో పాపం మంత్రి.. బ్రో సినిమాలో తనను వ్యంగ్యంగా చిత్రీకరించారని అంటున్నారు. ఆయన హిస్టరీని ఒక్కసారి చూసుకుంటే.. ఆ మంత్రి ఏమన్నారో .. ఏం చేశారో.. అందరికీ తెలుస్తుంది. గంట, అరగంట అని మాట్లాడేవారు.. మనకు మంత్రులుగా ఉన్నారు. ప్రాజెక్టులు, నీళ్లు వ్యవసాయం గురించి మాట్లాడవయ్యా అంటే.. బ్రో సినిమాలో తననేదో అన్నారని.. తననేదో చేశారని.. గంటలతరబడి ప్రెస్ మీట్లు పెడతాడు. రోజుల తరబడి మాట్లాడతాడు. ఈయన మనకు ఇరిగేషన్ మంత్రి. ఇదీ.. మన ఖర్మ'' అని చంద్రబాబు అననారు.
కడప జిల్లా, కొండాపురం మండలం తిమ్మాపురంలో పర్యటించిన చంద్రబాబు.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై - యుద్ధభేరి పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. యుద్ధభేరి ద్వారా.. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. గతంలో తాము ఏం చేశాం.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరిస్తున్నట్టు తెలిపారు. ఎవరివల్ల ఈ రాష్ట్రానికి, రైతులకు, ప్రజలకు నష్టం జరిగిందో తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సీఎం జగన్‌ను, ఆయన కుటుంబాన్ని కూడా అక్కున చేర్చుకున్న పులివెందుల ప్రాంతంలోనే మీటింగ్ పెట్టుకున్నామని తెలిపారు.
రాయల తర్వాత.. దేశమే!
కడప జిల్లాకు పెద్ద అసెట్ గండికోట అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో దీనిని బ్రాహ్మాండంగా అభివృద్ధి చేశానన్నారు. అలాగే ఒంటిమిట్టను అభివృద్ధి చేశానని, ఎయిర్ పోర్టును ఆధునీకరించానని చెప్పారు. సీమను ఆదుకున్నది కృష్ణదేవరాయలని.. తర్వాత తెలుగుదేశమేనని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అధికారంలో ఉంటే సీమకు నీటిఎద్దడి ఎదురయ్యేది కాదన్నారు. సీమలో జగన్ పుట్టినట్లు కథలు చెపుతారని మండిపడ్డారు. 'బాంబులకే భయపడలేదు నీకు భయపడుతానా' అని అన్నారు. తాను ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు 'బ్రో' సినిమా గురించి మాట్లాడతారని చంద్రబాబు చురకలంటించారు.