ఏపీ కేబినెట్ కూర్పు ఇలా ఉంటుందట
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన తెలుగుదేశం కూటమి బుధవారం (జూన్ 12)కొలువు తీరనుంది
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన తెలుగుదేశం కూటమి బుధవారం (జూన్ 12)కొలువు తీరనుంది. ముఖ్యంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే.. అందరి చూపు చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రివర్గం మీదనే ఉంది. మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? ఇందులో కూటమి భాగస్వామ్యం ఎంత? పవన్ రోల్ ఏమిటి? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేబినెట్ కూర్పు కసరత్తు పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన పదవులు ఎన్ని? పార్టీలో సీనియర్లు.. జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై చంద్రబాబు కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఈ రోజు (మంగళవారం)సాయంత్రం చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి మంత్రి పదవులకు సిద్ధం కావాలన్న సమాచారాన్ని ఇస్తారని చెబుతున్నారు. మంత్రి పదవులు దక్కే వారందరికి బాబు నుంచి కాల్స్ వెళ్లనున్నాయి.
ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్ లో భాగం కావటం ఖాయమైంది. ఈసారి ప్రభుత్వంలో ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండనున్నారు. పవన్ తో కలిపి మొత్తం నాలుగు మంత్రి పదవులు కేటాయిస్తున్నారు. బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గెలుపు ధీమాతో ఉన్న చంద్రబాబు ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ముందే.. మంత్రిపదవుల కూర్పుపై కసరత్తు షురూ చేశారు.
అయితే.. ఫలితాల్లో మాదిరి 164 స్థానాల్ని సొంతం చేసుకుంటామని చంద్రబాబు సైతం ఊహించలేదు. చారిత్రక విజయం నేపథ్యంలో మంత్రిపదవులు ఆశించే ఆశావాహుల సంఖ్య ఎక్కువైంది. దీంతో.. ఎవరికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి మహిళలకు.. యువతకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యత లభించనుంది. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపికైన నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల అవకాశాల్ని దెబ్బ తీయనుందని చెబుతున్నారు.
గతంలో కంటే ఈసారి అసెంబ్లీలో మహిళల సంఖ్య పెరిగింది. ఈసారి 21 మంది మహిళలు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గత అసెంబ్లీలో వీరి సంఖ్య 14 మాత్రమే. యువత సైతం పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. దీంతో.. వారికి ప్రాధాన్యత పెరిగే వీలుంది. దీనికి తోడు రానున్న పది - పదిహేనేళ్లలో రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యం ఉన్న వారికి అధిక అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లు కొందరికి అవకాశాలు చేజారే అవకాశం ఉంది. దీంతో.. పలువురు టీడీపీ సీనియర్లలో ఆందోళన నెలకొంది.