ఎట్టకేలకు పాత వాసనల్ని వదుల్చుకున్న చంద్రబాబు!
చేతిలో అధికారం లేని వేళలో కంటికి కనిపించన సీనియర్ నేతలు.. అధికారం చేతికి వచ్చిందంటే చాలు చంద్రబాబు చుట్టూ తిరగటమే కాదు
చేతిలో అధికారం లేని వేళలో కంటికి కనిపించన సీనియర్ నేతలు.. అధికారం చేతికి వచ్చిందంటే చాలు చంద్రబాబు చుట్టూ తిరగటమే కాదు.. ఆయన మీద ఒత్తిడి తెచ్చి మరీ పదవుల్ని సొంతం చేసుకునే సీనియర్లు తెలుగుదేశం పార్టీకి గుదిబండగా మారారని.. కొత్త నాయకత్వం తెర మీదకు రాకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శ తరచూ వినిపించేది. తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడైనంతనే.. ఇదే మాట బలంగా వినిపించి.. ఇప్పటికైనా కొత్త వారికి.. యువతకు చంద్రబాబు పెద్ద పీట వేస్తారా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
తాను మారానని.. తనలో మార్పు కొట్టొచ్చినట్లుగా చూపిస్తానని చెబుతున్న చంద్రబాబు మాటలకు తగ్గట్లే తాజాగా ఆయన కేబినెట్ కూర్పులో ఛేంజ్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. పార్టీకి అండగా నిలిచిన బీసీలకు పెద్దపీట వేయటంతో పాటు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ పదవులు ఖాయంగా తీసుకునే కొందరిని తప్పించటం ద్వారా కేబినెట్ కొత్త లుక్ కనిపించేలా చేయటంలో బాబు సక్సెస్ అయ్యారని చెప్పాలి.
1983 నుంచి ఇప్పటివరకు టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో ఐదారుగురు నేతలకు తప్పనిసరిగా మంత్రివర్గంలో చోటు ఉండేది. అలాంటివారిలో అందరి మదిలో మెదిలే మొదటి పేరు యనమల రామక్రిష్ణుడు. తాజాగా ఆయన్ను కేబినెట్ లోకి తీసుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోతూ కనిపించే ఆయన.. పవర్ పోయిన తర్వాత పత్తా లేకుండా పోతారన్న అపవాదు ఆయనకు ఉంది.
గడిచిన ఐదేళ్లలో తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న చంద్రబాబు.. తన తాజా కేబినెట్ కూర్పులో గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని తన జట్టు సిద్ధం చేసుకున్నట్లుగా చెప్పాలి. కళా వెంకట్రావు.. అయ్యన్నపాత్రుడు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈసారి వీరికి చోటు దక్కలేదు. ఈ తరహా నిర్ణయం తీసుకోవటం సాహసోపేతమైన చర్యగా చెప్పాలి. ఏమాటకు ఆ మాట చెప్పాలి. పార్టీ విపక్షంలో ఉన్న వేళలో పోరాటస్ఫూర్తిని రగిలించిన సీనియర్లుగా బుచ్చయ్య చౌదరి.. అయ్యన్న పాత్రుడు ఉన్నారు.
వారికి తాజా కేబినెట్ లో చోటు లభించనప్పటికీ వారికి ప్రభుత్వంలో కాకున్నా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తే బాగుంటుంది. మొత్తంగా ఈసారి పాత వారికి చెక్ చెప్పి.. కొత్త వారికి అవకాశాన్ని కల్పించటంపై పార్టీ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లకు చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో చోటు సాధించిన 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేసిన వారే. ఈ 17 మందిలో పది మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉండటం మరో విశేషంగా చెప్పాలి.
కొత్తవారు.. యూత్ ఫుల్ గా ఉండటం ద్వారా ప్రభుత్వం కొత్త రూపును సంతరించుకుందని చెబుతున్నారు. అంతేకాదు.. టీడీపీ అన్నంతనే గుర్తుకు కమ్మ సామాజిక వర్గానికి.. అందునా క్రిష్ణా జిల్లా నుంచి ఎలాంటి మంత్రిపదవి దక్కకపోవటం కూడా ఇదే తొలిసారి. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న చంద్రబాబును చూస్తే.. మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.