''మేం వస్తాం.. జగన్ పథకాలు కొనసాగిస్తాం''
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సంచలన ప్రకటన చేశారు. ``మేం వస్తాం.. జగన్ పథకాలు కొనసాగి స్తాం.
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సంచలన ప్రకటన చేశారు. ``మేం వస్తాం.. జగన్ పథకాలు కొనసాగి స్తాం. దీనిపై ఎలాంటి దుష్ప్రచారాన్నీ నమ్మొద్దు`` అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న రాష్ట్రంలో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని.. ఇది పక్కా అని తేల్చి చెప్పారు.
అందుకే.. తమపై వైసీపీ నాయకులు బురద జల్లుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వస్తే.. వైసీపీ అమలు చేస్తున్న పథకాలు ఆగిపోతాయని.. వలంటీర్లను ఆపేస్తారని.. ఇళ్లు వెనక్కి తీసేసుకుంటారని ప్రచారం చేస్తున్నారని.. కానీ, తాము సీఎం జగన్ లాగా.. ప్రజలకు మంచి జరుగుతున్నా.. తీసేసే రకం కాదన్నారు. అన్నీ కొనసాగిస్తామన్నారు. జగన్ చేసినదానికన్నా ఎక్కువగానే ప్రజలకు మేలు చేస్తామని చంద్రబాబు వివరించారు.
``మేం 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టాం. అన్నాక్యాంటీన్లు పెట్టాం. వారి ఆకలి తీర్చాం. కానీ, జగన్ వచ్చి. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు తీసేశాడు. వివిధ సామాజిక వర్గాలకు మేలు జరిగేలా మేం 27 పథకాలు ప్రవేశ పెట్టి మేలు చేశాం. కానీ, జగన్ వాటిని తీసేశాడు. అందరూ ఆయనలా ఉంటారని అను కుంటున్నారు. అందుకే మాపై దుష్ప్రచారం చేస్తున్నాడు. మేం వచ్చాక.. మంచి జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎలాంటి సందేహం వద్దు. వైసీపీ నాయకులు చెబుతున్న మాటలు కూడా నమ్మొద్దు`` అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ప్రజలను నాశనం చేసేలా తీసుకున్న నిర్ణయాలు మాత్రమే తమ ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తామని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామన్నారు. ప్రజలకు సెంటు భూమి ఇచ్చి.. తాను ఎకరాల స్థలంలో ప్యాలెస్‌లు కట్టుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన ఇచ్చిన సెంటుకు కుదిరితే అదనంగా ఇచ్చి.. తాము పేదలను ఆదుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. విశాఖను ఐటీ కేంద్రంగా ఆర్థిక రాజధానిగా మారుస్తామని చంద్రబాబు వెల్లడించారు.