వివేకా హత్యకేసుపై బాబు సంచలన వ్యాఖ్యలు... త్వరలో సమాధానం!!
ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించడంతో పాటు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించడంతో పాటు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. మరోపక్క ఇదే రోజు పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ సమయంలో చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చి బడ్జెట్ లో రూ.15వేల కోట్లు కేటాయించిందని.. దీంతో అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ కనిపిస్తోందని.. రాజధాని నిర్మాణం ఇప్పటికే పూర్తయి ఉంటే సుమారు రెండు, మూడు లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చేదని బాబు తెలిపారు. ఫలితంగా నేడు అప్పులు చేయాల్సిన వ్యవస్థ తీరేదని అన్నారు.
ఇదే సమయంలో పోలవరం టాపిక్ ఎత్తిన బాబు... పోలవరం 72శాతం పూర్తయ్యిందని అన్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2020-21 నాటికే పూర్తికావాల్సి ఉండగా.. ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య టాపిక్ ఎత్తారు చంద్రబాబు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఈ రోజు శాసనసభలో ప్రసంగించిన చంద్రబాబు.. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్థావన తెచ్చారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆ కేసులో నేరస్థుడే సీఎం అవ్వడం వల్ల పోలీసులు కూడా వంతపాడే పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో త్వరలో ఈ కేసు పరిష్కరించబడుతుందన్నట్లుగా బాబు రియాక్ట్ అయ్యారు.
ఈ మేరకు అసెంబ్లీలో వివేకా హత్య ప్రస్థావన తెచ్చిన బాబు... ఆ కేసు అనేక మలుపులు తిరిగిందని అన్నారు. హత్య జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి సీఎం వెళ్లారు.. సీబీఐ కి విషయం చెప్పడానికి సిద్ధపడ్డారు.. అయితే, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చింది.. నేరస్థుడే సీఎం అయితే పోలీసులు కూడా వంతపాడే పరిస్థితి నెలకొంది అని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... విచరణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని.. నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సీబీఐ సిబ్బందే వెనక్కి తిరిగి వచ్చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో... ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.