ఈ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఝలక్‌!

మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

Update: 2024-02-25 05:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో టీడీపీలో సీనియర్‌ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కిమిడి కళా వెంకట్రావు తదితరులకు సీట్లు దక్కలేదు. అలాగే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి రూరల్‌), గంటా శ్రీనివాసరావు (విశాఖ నార్త్‌)లకు సైతం సీట్లు ఇవ్వలేదు.

కాగా వైసీపీ నుంచి తప్పుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి)లకు సైతం సీట్లు దక్కలేదు. వైసీపీ నుంచి ఇప్పటివరకు టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక్క కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (నెల్లూరు రూరల్‌)కు మాత్రమే చంద్రబాబు సీటును కేటాయించారు.

ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు సీటు నిరాకరించారు. ఈ స్థానంలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ కు సీటు ఇచ్చారు. ఉండవల్లి శ్రీదేవి పేరు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరుతోపాటు బాపట్ల లోక్‌ సభా స్థానానికి వినిపించింది. అయితే తిరువూరుకు అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావును అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.

ఇక మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు కూడా చంద్రబాబు సీటు ప్రకటించలేదు. ఉదయగిరిలో కాకర్ల సురేశ్‌ కు సీటు కేటాయించారు. దీంతో మేకపాటికి చుక్కెదురు అయ్యింది. కాగా గతంలోనే తనకు సీటు ఇచ్చినా, ఇవ్వకున్నా తాను టీడీపీకే మద్దతిస్తానని మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ప్రకటించారు.

అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డికి కూడా సీటు కేటాయించలేదు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఉన్న ప్రత్యేకతే వేరు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కీలకమైన ఆర్థిక శాఖకు మంత్రిగా కూడా వ్యవహరించారు. వైఎస్సార్‌ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఆనం పేరు కూడా వినిపించింది.

ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు సీటును ఆశిస్తున్నారని ప్రచారం జరిగింది. తనకు లేదా తన కుమార్తె కైవల్యారెడ్డికి సీటు ఇవ్వాలని కోరారని టాక్‌ నడిచింది. అయితే ఆయనకు కానీ, ఆయన కుమార్తెకు కానీ తొలి జాబితాలో సీటు దక్కలేదు.

Tags:    

Similar News