రేర్ సీన్: బాబు అరెస్టుపై బాల్యస్నేహితుల ఆందోళన కం దీక్ష
ఒక రాజకీయ నాయకుడి జీవితంలో ఎత్తు పల్లాలు సహజంగా కనిపించేవే. ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో కేసులు.. అరెస్టులు సర్వసాధారణం అయ్యాయి
ఒక రాజకీయ నాయకుడి జీవితంలో ఎత్తు పల్లాలు సహజంగా కనిపించేవే. ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో కేసులు.. అరెస్టులు సర్వసాధారణం అయ్యాయి. గత కాలానికి సంబంధించిన రాజకీయ నేతల్లో చిట్టచివరి ముఖ్య నేతగా చంద్రబాబును చెప్పాలి. ఆయన తరం వారు ఇంత యాక్టివ్ గా సమకాలీన తెలుగు రాజకీయాల్లో ఎవరూ లేరని చెప్పాలి. అలాంటి అధినేత స్కిల్ స్కాం ఆరోపణల్లో భాగంగా అరెస్టు కావటం.. రాజమహేంద్రవరం జైల్లో రోజులు గడపటం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు వేళలోనూ.. ఆయన్ను రిమాండ్ కు ప్రకటించిన వేళలోనూ వచ్చిన స్పందన కంటే కూడా.. ఆ తర్వాతి రోజుల్లో ఎవరికి వారుగా బయటకు వస్తూ ఆందోళనలు.. నిరసనలు చేపడుతున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది తాజా నిరసన. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. పలు దేశాల్లోనూ ఆందోళనలు..నిరసనలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చంద్రబాబు బాల్య స్నేహితులంతా కలిసి తాజాగా చేపట్టిన నిరసన చూసినప్పుడు మాత్రం ప్రత్యర్థులు సైతం ఒకింత విస్మయానికి గురయ్యేలా చేసిందని చెప్పాలి. ఎందుకంటే.. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో పెద్దగా స్నేహితులు ఉండరని.. ఎవరికి ఎలాంటి సాయం చేయరని.. ఏదైనా పని చేయాలని అడిగితే.. ఎక్కడ ఇబ్బందో అన్న ఉద్దేశంతో తప్పించుకుంటారన్న మాటలు తరచూ వినిపిస్తుంటాయి.
అవన్నీ నిజమే అనుకుంటే.. ఈ రోజున ఆయన బాల్య స్నేహితులు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా గళం విప్పటం ఏమిటి? రోడ్ల మీదకు వచ్చిన నిరసన చేపట్టటం ఏమిటి? అన్నది చర్చగా మారింది. తమ నిరసనలో భాగంగా వారు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షించేలా మారాయి. తమ స్నేహం మీద ఒట్టు అని.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరంటూ ఆయన బాల్య స్నేహితులు.. సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్న వైనం ఇప్పుడు కొత్త చర్చగా మారింది.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో చంద్రబాబు బాల్యస్నేహితులు రిలే దీక్షలు షురూ చేవారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ఆయన బాల్యస్నేహితులు మాట్లాడుతూ.. 'చిన్నతనం నుంచే చంద్రబాబుది కష్టపడి పని చేసే స్వభావం. రాష్ట్ర సంక్షేమం కోసం పరితపించేవారు. కుట్రలు.. కుతంత్రాలు.. నీతిమాలిన రాజకీయాలు ఆయనకు తెలియవు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి. సీఎం జగన్ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను జైలుకు పంపారు' అంటూ వారు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా గళం విప్పిన బాల్యస్నేహితుల పేర్లను.. వారి నేపథ్యాల్ని చూస్తే.. అన్నీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. ఏమైనా.. డెబ్బై ప్లస్ వయసులో జైలుకు వెళ్లటం ఒక ఎత్తు అయితే.. దానికి నిరసనగా బాల్య స్నేహితులు రోడ్ల మీదకు రావటం రేర్ సీన్ గా చెప్పక తప్పదు.