లోకేశ్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు బాబు డిసైడ్ అయ్యారు
పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా చెబుతున్నారు.
కొలువు తీరే చంద్రబాబు ప్రభుత్వంలో లోకేశ్ మంత్రి పదవికి దూరంగా ఉంటారని.. పార్టీ మీదనే ఆయన ఫుల్ ఫోకస్ అంటూ ప్రచారం జరిగింది. మంత్రి పదవి మీద లోకేశ్ పెద్దగా ఆసక్తి చూపటం లేదన్న మాట పలువురి నోట వినిపించింది. అయితే.. ఇలాంటి ప్రచారానికి చెక్ చెప్పేస్తూ.. చంద్రబాబు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన ఫోకస్ మొత్తం పార్టీ మీదనే అని చెప్పటం.. మంత్రివర్గంలో చేరే కన్నా పార్టీ బాధ్యతల్ని చేపట్టటం ముఖ్యమన్న భావనను లోకేశ్ నుంచి వినిపించింది. అయితే.. మంత్రిగా బాధ్యతలు చేపడుతూ పార్టీ అంశాల్ని కూడా చూసుకోవాలన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీని ప్రమోట్ చేయటానికి.. ఐటీ కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావటానికి లోకేశ్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
గతంలోనూ మంత్రిగా వ్యవహరించిన లోకేశ్ పంచాయితీ రాజ్.. ఐటీ శాఖల మంత్రిగా వ్యవహరించారు. విశాఖపట్నం.. మంగళగిరి.. విజయవాడ కేంద్రాలుగా పలు ఐటీ కంపెనీల్ని తీసుకురావటంతో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో ఈ అవసరం చాలా ఉందని.. లోకేశ్ తప్పించి మరెవరూ బాగా చేయలేరన్న భావన చంద్రబాబులో ఉన్నట్లు చెబుతున్నారు. లోకేశ్ ప్రభుత్వంలో ఉంటే.. మరింత వేగంగా నిర్ణయాల అమలుకు వీలు అవుతుందన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే.. ఆయన లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.