ఎన్డీయే మీటింగ్ కు ముందు తర్వాత బాబుతో బీజేపీ పెద్దల భేటీలు ఎన్నంటే?

ఎన్డీయే పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు బుధవారం ఢిల్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది.

Update: 2024-06-06 04:30 GMT

ఎన్డీయే పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు బుధవారం ఢిల్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. గడిచిన కొన్నేళ్లుగా ఆయనకు ఎదురైన అనుభవాలకు భిన్నమైన వాతావరణం ఢిల్లీలో లభించింది. ఆయన ఏం మాట్లాడతారన్న ఆసక్తి అటు జాతీయ మీడియా నుంచి బీజేపీ నేతల వరకు అందరిలోనూ సాగింది. ఒకప్పుడు తనకు లభించే మర్యాదలకు చంద్రబాబు పొంగిపోయే వారు. ఇప్పుడు మాత్రం ఆయన గుంభనంగా ఉంటున్నారు.


ప్రధానమంత్రి మోడీ నివాసంలో జరిగిన ఎన్డీయే భేటీకి హాజరైన చంద్రబాబు.. దానికి కాస్త ముందుగా బీజేపీ ముఖ్యలతో వరుస భేటీలు అయ్యారు. ఆయనతో మాట్లాడేందుకు బీజేపీకి చెందిన అగ్రనేతలు పలువురు ఆసక్తి చూపారు. మోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు.. పీయూష్ గోయల్ చర్చలు జరిపారు. భేటీకి ముందు అమిత్ షా, నడ్డాలు చంద్రబాబుతో భేటీ కాగా.. కూటమి సమావేశం తర్వాత పీయూష్ గోయిల్ తో చర్చలు జరిపారు. అనంతరం ఏపీ భవన్ కు వెళ్లారు. అక్కడే ఉండే తెలంగాణ భవన్ లో తెలుంగాణ గవర్నర్ రాధాక్రిష్ణన్ తో భేటీ అయ్యారు. వీరి సమావేశం దాదాపు అరగంట పాటు సాగింది.


ఈ సందర్భంగా చంద్రబాబు తీరు గురించి.. ఆయన కమిట్ మెంట్ గురించి ఢిల్లీ జర్నలిస్టులు ఎక్కువగా మాట్లాడుకోవటం కనిపించింది. గతంలోనూ చంద్రబాబు ఒకసారి కమిట్ మెంట్ ఇస్తే.. దానికి కట్టుబడి ఉంటారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నేషనల్ ఫ్రంట్ వేళలోనూ బాబు తన మద్దతు ఇస్తానని ప్రకటించిన తర్వాత పూర్తి కాలం పాటు మద్దతు ఇవ్వటమే తప్పించి.. మధ్యలో తప్పుకోవటం రాజకీయ ప్రయోజనాల కోసం ప్లేట్ ఫిరాయించటం లాంటివి చంద్రబాబులో ఉండవన్న చర్చ సాగింది.

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. వరుస భేటీల్లో పాల్గొన్నారు. బుధవారం మొత్తం ఆయన బిజీబిజీగా గడిపారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన.. అదే రోజు తిరిగి వచ్చేయటం గమనార్హం. గతానికి భిన్నంగా చంద్రబాబుతో మాట్లాడేందుకు బీజేపీకి చెందిన ముఖ్యనేతలంతా తపిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. నిజానికి.. చంద్రబాబు ఈ రోజున ఎన్డీయే కూటమిలో ఉన్నారంటే దానికి కారణం అమిత్ షానే.

నిజానికి చంద్రబాబుతో పొత్తుకు మోడీ సానుకూలంగా లేరన్న మాట అప్పట్లో బలంగా వినిపించేది. అందుకు తగ్గట్లే పలు పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబును ఎన్డీయే కూటమిలోకి తెచ్చేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. బీజేపీ ఢిల్లీ పెద్దల నుంచి సానుకూల స్పందన రానప్పటికీ.. చివరకు వరకు పోరాడిన పవన్ పుణ్యమా అని ఎన్డీయేలో భాగస్వామి అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతుందన్నది అందరికి తెలిసిందే.

Tags:    

Similar News