చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ లో కేటీఆర్ దిద్దుకోలేని తప్పు చేశారా?

ఇందులో భాగంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. కాసింత ఆశ్చర్యం వ్యక్తం కాక మానదు

Update: 2023-09-29 05:15 GMT

ఎంత తోపు.. తురుమ్ ఖాన్ అయినప్పటికీ.. రాజకీయాల్లో కీలకమైన వేళలో..సున్నిత అంశాల మీద స్పందించే విషయంలో ఆచితూచి అన్నది చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం ఒక స్థాయి దాటిన తర్వాత ఆటోమేటిక్ గా కొందరి నోటి నుంచి వచ్చే మాటల్లో తేడా ఇట్టే వచ్చేస్తుంది. అలా రావటం పార్టీకి ఎంత నష్టం వాటిల్లేలా చేస్తుందన్న విషయాన్ని తాజాగా తెలంగాణ గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ విపక్ష నేత చంద్రబాబు స్కిల్ స్కాం ఆరోపణలతో రాజమహేంద్రవరం జైల్లో ఉంచటం తెలిసిందే. దీనిపై టీడీపీ వర్గాలతోపాటు.. హైదరాబాద్ లోని బాబు సానుభూతిపరులు.. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు అరెస్టుపై తెలంగాణలోని ఆంద్రా మూలాలు ఉన్న వారు.. టీడీపీ అభిమానులు పలువురు తమ వాదనను వినిపిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. కాసింత ఆశ్చర్యం వ్యక్తం కాక మానదు. ఎంతగా పరిమితులు ఉన్నప్పటికి..  కార్లలో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు వందలాది కార్లతో ర్యాలీ చేయటం మొదలు.. ఫెనాన్షియల్ డిస్ట్రిక్ లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయటం అందరిని ఆకర్షిస్తోంది. ప్రజల్లో నెలకొన్న సానుభూతిని గుర్తించిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బాబు అరెస్టును తీవ్రంగా ఖండించేలా వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, బాబుకు మద్దతుగా తాము గళం విప్పామన్న విషయాన్ని తెలిపేందుకు వీలుగా పలువురు వ్యక్తిగత స్థాయిల్లో కలుస్తున్న పరిస్థితి. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు తమ మద్దతు తెలిపేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. కొందరు నేతలు అయితే ఇతర పార్టీల టికెట్లను ఆశించే వారు కూడా.. రాజమండ్రి వెళ్లి చంద్రబాబు సతీమణిని కలిసి తమ మద్దతు ఇవ్వటం కనిపిస్తుంది.

ఇలాంటి సందర్భంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బాబు అరెస్టుపై హైదరాబాద్ లో ఎందుకు నిరసనలుచేస్తారు? మీ రాష్ట్రంలో చేసుకోండి అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలకు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పంచ్ లు వేస్తున్నారు. అందులో అందరూ నిజమే కదా? అన్న భావన కలిగించే పోస్టులు కొందరు పెడుతున్నారు. అలాంటిదే చూస్తే.. ఏపీలోని తాడేపల్లిలో బీఆర్ఎస్ పార్టీ హెడ్డాఫీసు ముందు సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. బాబు గురించి హైదరాబాద్ లో ఎందుకు ఆందోళన అన్న మంత్రి కేటీఆర్.. తాడేపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్లు? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. లిక్కర్ స్కాం కేసులో తమ పార్టీ నేతల్ని పెద్ద ఎత్తున ఢిల్లీకి తీసుకెళ్లి బలప్రదర్శనను గుర్తు చేస్తూ.. చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇదంతా చూసినప్పుడు తెలంగాణలోని పదుల సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ మూలాలు.. సీమాంధ్రకు చెందిన ఓటర్లు పెద్ద ఎత్తున ఉండటం తెలిసిందే. వారందరిలోనూ గుర్రు పుట్టేలా కేటీఆర్ మాటలు మారినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News