సమస్యలు-సవాళ్లతో చంద్రబాబు ప్రయాణం.. ఎప్పటి వరకు..?
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ను కూడా కూర్చుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ను కూడా కూర్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఎటు చూసినా.. ఆయన పాలన 2014లో సాగినంత ఈజీ అయితే కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఇప్పుడు రాష్ట్రపరిస్థితి దారుణంగా ఉండడమే. అప్పులు.. సమస్యలు.. సవాళ్లు సర్కారుకు ఆహ్వానం పలుకుతున్నాయి. వీటిని తట్టుకుని ముందుకు నడిపించడం.. నడవడం కూడా.. పాలకులకు కత్తిమీద సాములానే కనిపిస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధానిని పరుగులు పెట్టించాలి. దీనికి కేంద్రం నుంచి ఏమేరకు సహకారం ఉంటుందనేది ప్రశ్న.
ఇక, ప్రధాన ప్రాజెక్టులైన పోలవరం, కడప ఉక్కు వంటివి సర్కారు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి. వీటితోపాటు.. రహదారుల నిర్మాణం సర్కారు పెద్ద సమస్య. ఎక్కడికక్కడ రహదారుల నిర్మాణం నిలిచిపోయింది. మరోవైపు.. కొత్త రహదారుల ఏర్పాటు వంటివి సాకారం కావాల్సి ఉంది. ఇక, పరిశ్రమలు నూతనంగా ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కూడా.. సర్కారు కు పెద్ద ఇబ్బందిగానే పరిణమించనుంది. ఉపాధి, ఉద్యోగ కల్పన వంటివి కూడా చంద్రబాబు పనితీరును బట్టి ఆధారపడిఉన్న పరిస్థితి గతంలో ఉంటే.. ఇప్పుడు పెరిగిన నిరుద్యోగం.. ఆకాంక్షలు వంటివి సర్కారుకు తలనొప్పిగా మారాయి.
సామాజిక పథకాల విషయాన్ని తీసుకుంటే.. ప్రతి నెల 8-9 వేల కోట్లరూపాయలు కేవలం పింఛన్లకే కావాల్సి ఉంటుంది. సంపద సృష్టించడం.. అనేది చెప్పినంత ఈజీకాదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదేసమయంలో ఉన్న ఉద్యోగులకు కోరికలు తీర్చడం.. వారి సమస్యలు పరిష్కరించడం వంటివి కూడా.. సర్కారుకు ప్రధాన సవాలుగా మారింది. ఎలా చూసుకున్నా.. ఉద్యోగులను సంతృప్తి పరచడం, కొత్త ఉద్యోగాల కల్పన, ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించడం.. వంటివి చూస్తే.. చంద్రబాబు సర్కారుకు కనిపిస్తున్న ప్రధాన సమస్యలుగానే చెప్పాలి.
వీటితోపాటు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు అందించాల్సి ఉంటుంది. ఇది మరో పెద్ద సమస్య. ఇప్పటికే ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉంది. దీనిని బయటపడేసేందుకు అనేక మార్గాలు పరిశీలించినా.. అవేవీ సక్సెస్ కాలేదు. సంక్షేమంతోనే హరించుకుపోయిన ఆర్థిక వ్యవస్థ కారణంగా గత ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అంతకుమించిన సంక్షేమాన్ని అందించాల్సి రావడం.. ప్రాజెక్టులను కొనసాగించాల్సిన అవసరం ఉన్న దరమిలా.. కేంద్రంపై నే చంద్రబాబు ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇవన్నీ పరిష్కరించాలంటే.. కేంద్రం నుంచి ఉదార సాయం అందాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేస్తారో.. చూడాలి.