చంద్రబాబు ప్రమాణం అక్కడ నుంచేనా ?
వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ విషయం ఎన్నికల ప్రచారంలో జగన్ చెబుతూ వచ్చారు
వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ విషయం ఎన్నికల ప్రచారంలో జగన్ చెబుతూ వచ్చారు. ఇపుడు ఆయన పార్టీ నేతలూ అదే చెబుతున్నారు. వైసీపీ ఈ విషయంలో కచ్చితంగానే ఉంది. అధికారంలోకి వస్తున్నామని కూడా జోస్యం చెబుతోంది. వైసీపీ సంగతి అలా ఉంచితే టీడీపీ విషయం ఏమిటి అన్న చర్చ వస్తోంది. అనూహ్య ఫలితాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. కూటమి నేతలు అయితే జూన్ 4న పండగ చేసుకుందామని ప్రకటిస్తున్నారు.
కానీ టీడీపీ ఎపుడు ఎక్కడ ప్రమాణం చేస్తుంది అన్నది చెప్పడం లేదు. 2014లో చంద్రబాబు జూన్ 8న ప్రమాణం చేసారు. ఆనాడు ఆయన గుంటూరు జిల్లాలో ప్రమాణం చేశారు. ఈసారి కూడా టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారా అన్న దాని మీద కూడా పసుపు శిబిరంలో నేతలు అంతా ఆలోచిస్తున్నారు.
జగన్ విశాఖలో అంటే దానిని రాజధానిగా చేస్తున్నామన్న సిగ్నల్స్ ఇచ్చేందుకు. చంద్రబాబు నినాదం అమరావతి కాబట్టి ఆయన ప్రమాణం అక్కడే ఉంటుంది ఉండాలని అంటున్నారు. టీడీపీకి ఈసారి పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి 2014లో పోటీ చేస్తే 106 సీట్లు సాధించింది. ఈసారి బలమైన వేవ్ ఉంది కాబట్టి 140 సీట్లకు తగ్గవని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు.
బీజేపీకి ఇచ్చిన సీట్లలో కూడా సగం దాకా గెలుస్తారని అలాగే జనసేన సీట్లు 15 కంటే ఎక్కువే తప్ప తగ్గవని అంచనా కడుతున్నారు. ఇవన్నీ కలిపిస్తే 140 పై దాటిపోతాయని లెక్క వేస్తున్నారు. తెలుగుదేశం ఇచ్చిన హామీలను ఆ పార్టీ నిబద్ధతను అభివృద్ధిని చూసే పట్నం, పల్లె అన్న తేడా లేకుండా ఓటెత్తారు అని అంటున్నారు. ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఒకే రకమైన పోలింగ్ సరళి నమోదు అయింది అని అంటున్నారు.
ఫలితాలు పూర్తి సానుకూలంగా ఉంటాయని జూన్ 4న తొలి ట్రెండ్స్ లోనే విజయం ఖాయం అవుతుందని కూడా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంపీ సీట్ల విషయం తీసుకుంటే ఒకే ఒక్క సీటు తప్ప 24 సీట్లూ తమవే అని అంటున్నారు. ఆ ఒక్క ఎంపీ సీటు ఎక్కడో ఏమిటో చెప్పడం లేదు.
ఏపీలో అన్ని వర్గాలూ అయిదేళ్ళ పాటు జగన్ పాలనలో పూర్తిగా విసిగిపోయాయని దాని ఫలితమే ఈ తీర్పు అని అంటున్నారు పల్లెలు పట్నాలు అన్న తేడా ఎపుడూ లేదని, ఆ వర్గీకరణ అసలు కుదరదని, ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా ఏపీ తీర్పు ఉంటుందని అది గతంలో రుజువు అయిందని ఈసారి కూడా అదే జరుగుతుందని కూడా టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎపుడు అంటే కేంద్రంలో మోడీ ప్రధానిగా ప్రమాణం చేసాక ఆయన్ని ముఖ్య అతిధిగా తీసుకుని వచ్చి మరీ తాము చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.