టీడీపీతో పీకే సెట్ కాకపోవడనికి అసలు కారణం ఇదేనా?

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా టీడీపీతో ప్రయాణం విషయంలో ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

Update: 2024-01-23 15:30 GMT

ప్రస్తుత రాజకీయాల్లో ఒక పార్టీకి అభ్యర్థులు, కార్యకర్తలు, ఓటర్లు ఎంత ముఖ్యమో ఎన్నికల వ్యూహకర్తలు కూడా అంతే ముఖ్యం అనే పరిస్థితి వచ్చేసిందనే అనుకోవాలి! అయితే గెలుపోటముల్లో వీరి పాత్ర ఎంత అనే విషయానికి సంబంధించి ఎలాంటి పరామితులూ లేనప్పటికీ... ప్రజానాడిని వీరు పట్టగలరు, ప్రజాస్వామ్యాన్ని వీరు శాసించగలరు అన్న స్థాయిలో బిల్డప్స్ మాత్రం వినిపిస్తుంటాయి!! అయితే... ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసేవారూ లేకపోలేదు!!

వాస్తవానికి ఎన్నికల్లో వ్యూహకర్తలు అవసరమా అంటే.. భిన్నమైన సమాధానాలు వచ్చే రోజులివి! సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ లో భాగంగా ఈ ఉద్యోగం సృష్టించబడిందనే వారూ లేకపోలేదు.. ఇదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా వీరు కూడా ఉంటే బెటర్ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా టీడీపీతో ప్రయాణం విషయంలో ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అవును... బీహార్ లో చేపట్టిన "జన్ సురాజ్" పాదయాత్ర సందర్భంగా ఓ న్యూస్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిశోర్... చంద్రబాబుతో భేటీ అయిన విషయం, అందుకు గల కారణాలను వెల్లడించారు. ఇందులో భాగంగా... ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని.. ఈ సందర్భంగా రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు తాను పని చేయట్లేదనే విషయాన్ని చంద్రబాబుకు చెప్పినట్లు చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... ప్రస్తుతం తాను బిహార్ రాజకీయాల పైనే పూర్తి దృష్టి పెట్టానని, ఏపీలో ఏ పార్టీ తరఫునా తాను పని చేయట్లేదని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు. అయితే... టీడీపీ తో ప్రశాంత్ కిశోర్ కలిసి పనిచేయకపోవడానికి అసలు కారణం అదికాదు అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. తాను పనిచేయట్లేదు అనే విషయాన్నే చెప్పాలనుకుంటే... అది ఫోన్ లో చెప్పినా, కామన్ ఫ్రెండ్ తో కబురు పంపినా సరిపోయేది కదా అని లాజిక్ లాగుతున్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి, చంద్రబాబుతో చాలా సమయం భేటీ అయిన తర్వాత.. తాను వర్క్ చేయనని, తన మనసంతా బీహార్ పైనే ఉందని చెప్పడం అంత నమ్మశక్యంగా లేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో... డబ్బుల బేరాల దగ్గరే ప్రశాంత్ కిశోర్ కి చంద్రబాబుకీ సేట్ కాలేదని.. ఆ డీల్ నచ్చనందువల్లే పీకే నాడు విజయవాడ నుంచి తిరిగి పయణమైపోయారని అంటున్నారు.

ఇందులో భాగంగా... టీడీపీకి పనిచేయడం కోసం ప్రశాంత్ కిశోర్ రూ. 150 కోట్లు అడిగారని.. అయితే ఎన్నికలకు కేవలం రెండు మూడు నెలలు మాత్రమే సమయం ఉండటం వల్ల అది ఎక్కువ మొత్తం అని బాబు భావించారని, అందువల్ల రూ.50 కోట్లు మాత్రమే ఇవ్వగలమనే విషయాన్ని స్పష్టంగా చెప్పారని.. అయితే ఆ డీల్ కు ఆమోదం తెలుపక పీకే తిరిగి బీహార్ వెళ్లిపోయారని ఒక చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. మరి ఈ డీల్ కుదరకపోవడానికి పీకే చెప్పిందే కారణమా.. లేక, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే వాస్తవమా అనేది మాత్రం తేలాల్సి ఉంది!!

Tags:    

Similar News