బీసీకి ఎక్కడ కేటాయిస్తారు ?

గుంటూరు పార్లమెంటు పరిధిలో బీసీలకు కేటాయించాల్సిన అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఇబ్బందులు పడుతోంది

Update: 2024-02-02 11:30 GMT

గుంటూరు పార్లమెంటు పరిధిలో బీసీలకు కేటాయించాల్సిన అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఇబ్బందులు పడుతోంది. టీడీపీ అంటేనే బీసీల పార్టీగా చంద్రబాబునాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు పదేపదే చెప్పుకుంటున్నారు. మరి ఆచరణలోకి వచ్చేసరికి బీసీకి కేటాయించటానికి సరైన నియోజకవర్గమే దొరకటంలేదని పార్టీలో చర్చ పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో బీసీలు బాగా ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు రెండు మాత్రమే. వీటిల్లోని మంగళగిరిలో స్వయంగా లోకేషే పోటీ చేస్తున్నారు.

రెండో నియోజకవర్గం గుంటూరు వెస్ట్. ఈ నియోజకవర్గంలో గట్టి బీసీ నేత కనబడటం లేదు. పైగా ఈ సీటును కూడా కావాలని జనసేన అడుగుతోందని సమాచారం. దాంతో ఏమి చేయాలో చంద్రబాబుకు అర్ధంకావటం లేదట. తాడికొండ, పత్తిపాడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు. తెనాలి నియోజకవర్గం పొత్తులో జనసేనకు వెళిపోతోంది. పొన్నూరు నుండి మాజీ ఎంఎల్ఏ దూళ్ళిపాళ నరేంద్ర పోటీచేయటం దాదాపు ఖాయం. ఇక మిగిలింది గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మాత్రమే. గుంటూరు వెస్ట్ లో బీసీలతో పాటు కమ్మ, బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలున్నాయి.

ఈ నియోజకవర్గంలో ఎవరిని పోటీచేయించాలనే విషయమై సర్వే చేయించినపుడు గట్టి అభ్యర్ధులుగా ఎవరు తేలలేదట. పైగా ఇక్కడ నుంచి పోటీ చేయటానికి చాలామంది ఎన్ఆర్ఐలు బాగా ఉత్సాహం చూపిస్తున్నారని పార్టీవర్గాల టాక్. లోకల్ నేతలకు టికెట్లిస్తే క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందో తెలీటంలేదు. ఎందుకంటే స్ధానిక నేతల్లో అంత గట్టివాళ్ళు లేరట. ఇదే సమయంలో ఎన్ఆర్ఐలకు కేటాయిస్తే జనాలు ఓట్లేస్తారో లేదో తెలీటంలేదు. అందుకనే పక్క నియోజకవర్గాల్లోని గట్టి నేతలను వెస్ట్ నియోజకవర్గంలో పోటీచేయించమని లోకల్ నేతలు కొందరు చంద్రబాబుకు సూచించారట.

ఈ విషయం ఇలాగుంటే ప్రజా వైద్యశాల నడుపుతున్న డాక్టర్ శేషయ్య పోటీచేసే విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. డాక్టర్ తో ఇప్పటికే లోకేష్ ఒకసారి మాట్లాడారట. మరి రాబోయే ఎన్నికల్లో శేషయ్య పోటీచేస్తారా ? సీటును జనసేనకు కేటాయించేస్తారా ? లేకపోతే బయట నియోజకవర్గం నుండి ఇంకెవరినైనా పోటీలోకి దింపుతారా అన్నది తెలీటంలేదు. ఏదేమైనా బీసీకి ఇచ్చే సీటు విషయంలో మాత్రం పార్టీ వెనకబడిందనే చెప్పాలి.


Tags:    

Similar News