అధికారులు నిద్రపోతున్నారా? : తెలంగాణ హైకోర్టు సీరియస్
తెలంగాణ ప్రభుత్వంపైనా, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ అధికారులపైనా ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేసింది.
తెలంగాణ ప్రభుత్వంపైనా, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ అధికారులపైనా ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని మండిపడింది. కోర్టులు ఆదేశాలు ఇచ్చే వరకు కూడా స్పందించరా? అని ప్రశ్నించింది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో గత పది హేను రోజులుగా చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనం వికటిస్తోంది.దీంతో విద్యార్థులు అనారోగ్యానికి గురై.. ఆసుపత్రుల పాలవుతున్నారు.
తాజాగా మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అదేవి ధంగా కోర్టు కూడా పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటో విచారణకు స్వీకరించింది. తాజాగా బుధవారం ఆయా పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మధ్యాహ్నం భోజనం కల్తీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నారని అధికారులను నిలదీసింది. అంతేకాదు .. నిద్రపోతున్నారా? నిద్ర నటిస్తున్నారా? అని నిప్పులు చెరిగింది.
కాగా, ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. వివరాలు సమర్పించేందుకు వారం రోజులు గడువు కావాలని కోరారు. ఈ సమయంలో కోర్టు మరింత ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తమాషాగా ఉందా? వారం రోజులసమయం ఎందుకు అని ప్రశ్నించింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి ఒక్క గంటసమయం సరిపోతుందని, మహా అయితే ఒక్కరోజు సరిపోతుందని వ్యాఖ్యానించింది.
అయినప్పటికీ న్యాయవాది వారం రోజులు కావాలని పదే పదే కోరడంతో హైకోర్టు సమ్మతించింది. అయి తే.. తాము ఆదేశాలు ఇస్తేనే పనిచేసేలా ఉన్నారని, లేకపోతే నిద్రపోయేలా ఉన్నారని వ్యాఖ్యానించింది. సంబంధత అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. అధికారులకు కూడా పిల్లలున్నారని, పేద పిల్లల పట్ల మానవత్వం చూపించలేక పోతున్నారా? అని నిలదీసింది. ఈ ఘటన అనంతరం కలెక్టర్.. సంబంధితపాఠశాలను సందర్శించేందుకు వెళ్లడం గమనార్హం.