ప్రధాని మోడీతో భేటీ... పవన్ ఇంట్రస్టింగ్ పోస్ట్!
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చ జరిగిందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంటే ప్రధాని మోడీకి ఎంత అభిమానం అనేది తెలిసిన విషయమే. వీరిద్దరూ కలుసుకున్నప్పటి ఫోటోలు, వీడియోలు చూసిన ఎవరికైనా ఈ విషయం స్పష్టమవుతుంటుందనే చెప్పాలి. ఉన్నంతలో ప్యూర్ గా వితౌట్ ఫిల్టర్ వీరిద్దరూ ఉంటారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.
ఇక పవన్ కల్యాణ్ కు మోడీ అంటే ఎంతో గౌరవం అని, మరెంతో విధేయత అని చెబుతుంటారు. భవిష్యత్తులో ఏపీలో బీజేపీకి పవన్ అవసరం చాలా ఉందనే వారూ ఉన్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చ జరిగిందని అంటున్నారు.
అవును... భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. జలజీవన్ మిషన్ అమలులో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితి పొడిగింపు మొదలైన అంశాలపై మోడీతో చర్చించారని అంటున్నారు.
ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ఎక్స్ లో షేర్ చేసిన పవన్ కల్యాణ్... ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... పార్లమెంట్ సమావేశాల బిజీ మధ్య ఎంతో విలువైన సమయాన్ని తనకోసం వెచ్చించినందుకు ప్రధానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం పట్ల ప్రధాని మోడీకి ఉన్న నిబద్ధత, ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.
అంతకముందు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ను ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కలవడం పవన్ కు ఇదే మొదటి సారి. మరోవైపు పవన్ ను లావు శ్రీకృష్ణదేవరాయులు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పురందేశ్వరి కలిసారు.