కోల్ కతా టూ ట్రంప్ కార్యవర్గం... ఎవరీ జై భట్టాచార్య?

ఈ క్రమంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే ఎన్.ఐ.హెచ్.కు తదుపరి డైరెక్టర్ గా జై భట్టాచార్యను నియమించారు.

Update: 2024-11-27 08:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. వచ్చే ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే ఎన్.ఐ.హెచ్.కు తదుపరి డైరెక్టర్ గా జై భట్టాచార్యను నియమించారు.

అవును... డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో మరో భారతీయుడికి కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ మేరకు ట్రంప్.. కోల్ కతాలో జన్మించిన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ఆర్థికవేత్త భట్టాచార్యను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్.ఐ.హెచ్)కు తదుపరి డైరెక్టర్ గా నియమించారు. ఈ మేరకు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా... జై భట్టాచార్యను ఎన్.ఐ.హెచ్. డైరెక్టర్ గా నియమించడం తనకు చాలా ఆనందంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సహకారంతో భట్టాచార్య, ఎన్.ఐ.హెచ్.ను నడిపించడంతో పాటు దేశ ప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణలు చేసేందుకు పనిచేస్తారని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... అమెరికాను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చేందుకు వారిద్దరూ కలిసి కృషి చేస్తారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఎవరీ జై భట్టాచార్య?:

కోల్ కతాలో జన్మించిన జై భట్టాచార్య (56) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. ఈ సమయంలో 1990లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేశారు. 1997లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి పట్టభద్రుడయ్యారు. 2000లో స్టాన్ ఫోర్డ్ నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పొందారు.

ఇదే సమయంలో... స్టాన్ ఫోర్డ్ సెంటర్ ఫర్ డెమోగ్రఫీ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజింగ్ కు డైరెక్టర్ గా ఉన్నారు! ఇదే క్రమంలో... స్టాన్ ఫోర్డ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ అండ్ ఫ్రీమన్ స్పోగ్లీ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో సీనియర్ ఫెలో కూడా జై భట్టాచార్య.

ఇటీవల కోవిడ్ -19 ఎపిడెమియాలజీని అధ్యయనం చేయడం.. యూఎస్ ప్రభుత్వ కోవిడ్ విధానలపై బహిరంగ విమర్శలు చేయడం చేశారు జే భట్టాచార్య. కోవిడ్ సమయంలో తీసుకున్న నిర్ణయాలు.. యునైటెడ్ స్టేట్స్ లోని ఆరోగ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పోగొట్టిందని ఆయన బలంగా వాదించారు!

Tags:    

Similar News