భారత్ లో ఓవర్సీస్ ఓటర్ల భాగస్వామ్యం మరీ ఇంత ఘోరమా..?
అవును... గత ఎన్నికల కోసం సుమారు 1.2 లక్షల మంది ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
ఓటు వేయడంలో ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు విదేశాల్లో ఉన్న భారతీయులు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో చూపిస్తున్న ఉత్సాహం ఓటు వేసే విషయంలో చూపించడం లేదనే విమర్శలు తెరపైకి వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వీరి సంఖ్యం సున్నా శాతంగా ఉండటం మరింత చర్చనీయాంశం అవుతుంది. తాజాగా వీటికి సంబంధించిన లెక్కలు వెలువడ్డాయి.
అవును... గత ఎన్నికల కోసం సుమారు 1.2 లక్షల మంది ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. కానీ... ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో మాత్రం ఆ ఉత్సాహం ప్రదర్శించలేకపోయారని అంటున్నారు. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాలో షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి.
2019లో 99,844 మంది విదేశీ భారతీయులు ఓటర్లుగా నమోదు చేసుకోగా.. ఈసీ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం... 2024లో 1,19,374 మంది ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా 89,839 మంది కేరళ రాష్ట్రంలో నమోదు చేసుకున్నారు. అయితే ఆ 1,19,374 మందిలో 2,958 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు!
ఇక 89,839 మందిలో అత్యధికంగా 2,670 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో 885 మంది విదేశీ ఓటర్లు ఉండగా.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఇక మహారాష్ట్రలో 5,097 మంది ఎన్నారై ఓటర్లు ఉండగా.. వారిలో 17 మంది మాత్రమే ఓటు వేయగా.. ఆంధ్రప్రదేశ్ లోని 7,927 మంది ఎన్నారై ఓటర్లు నమోదు చేసుకోగా కేవలం 195 మంది మాత్రమే ఓటు వేయడానికి వెళ్లినట్లు చెబుతున్నారు. ఇక పలు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకు ఈ ఎన్నారై ఓటర్ల సంఖ్య శూన్యంగా ఉందని అంటున్నారు.
ఇందులో భాగంగా... కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి అనేక పెద్ద రాష్ట్రాలు విదేశీ ఓటర్లను సున్నాగా చూడగా.. 19 మంది ఓటర్లున్న అస్సాంలో ఒక్కరూ ఓటు వేయలేదు. ఇదే సమయంలో... 89 మంది నమోదిత ఓటర్లు ఉన్న బీహార్ లో ఓవర్సీస్ ఓటర్ల పోలింగ్ శాతం సున్నా అని చెబుతున్నారు. గోవాలోని 84 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయలేదు.