హత్యల్ని డీల్ చేయటం చంద్రబాబుకు చేతకాదా?
పాలన సాగించేందుకు ఎత్తులు చాలానే అవసరమన్న విషయాన్ని చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పాలన సాగించేందుకు ఎత్తులు చాలానే అవసరమన్న విషయాన్ని చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో డక్కామొక్కీలు తిన్న బాబుకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా గుణపాఠాలు నేర్చుకోలేదన్న మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు కాస్త ముందుగా చోటు చేసుకున్న వైఎస్ వివేకానంద హత్యను సరిగా డీల్ చేయలేకపోయారన్న చెడ్డపేరును తెచ్చుకున్నారు.
చేతిలో అధికారం ఉండి కూడా సంచలనంగా మారిన మర్డర్ కేసును డీల్ చేయటం.. యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవటం.. అమలు చేయటం.. నిందితుల మీద ఉక్కుపాదం మోపటంతో పాటు.. దారుణ హత్యతో వచ్చి పడే ఇమేజ్ డ్యామేజ్ ను కంట్రోల్ చేయటంలో ఘోరంగా ఫెయిల్ కావటం తెలిసిందే. వివేకా హత్య వేళ.. చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు రావటం.. వాటిని ఎదుర్కొనే విషయంలోనూ సరిగా హ్యాండిల్ చేయలేదన్న మాట బలంగా వినిపించింది.
కట్ చేస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ఘన విజయాన్ని సాధించటం.. మరోమారు చంద్రబాబు సీఎం కావటం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయ్యారో లేదో యాబై రోజులకే ఒక దారుణ హత్య చోటు చేసుకోవటం.. ఆ హత్య కేసుతో ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. పల్నాడు జిల్లా వినుకొండలో అందరూ చూస్తుండగానే బహిరంగంగా రషీద్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయటం తెలిసిందే.
వైసీపీకి చెందిన సదరు బాధితుడి బ్యాక్ గ్రౌండ్ సైతం కత్తి పట్టుకున్నోడే. హత్య చేసిన వ్యక్తి సైతం కొంతకాలం క్రితం వరకు వైసీపీ ఫాలోయరే. ఆ తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. రషీద్ మర్డర్ కేసును చూసినప్పుడు.. దాన్ని హ్యాండిల్ చేసే విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారన్న విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అదేసమయంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సదరు మర్డర్ మీద చేసిన ప్లానింగ్ అధికార టీడీపీకి ముచ్చమటలు పోయేలా చేసింది. తీవ్రమైన ఒత్తిడికి తీసుకొచ్చి.. కేసు విచారణను పరుగులు తీయించటంలో సక్సెస్ కాలేదు.
రషీద్ హత్య కేసును చూసినప్పుడు వైఎస్ వివేకా మర్డర్ కేసు గుర్తుకు రాక మానదు. దీనికి కారణం.. ఈ రెండు సంచలన హత్యలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనే చోటు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఈ రెండు హత్యలు చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి. ఈ రెండింటిలోనూ చంద్రబాబు ఫెయిల్యూర్ కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ హత్య మీదా.. చంద్రబాబు సర్కారు వైఫల్యం మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూసుకెళుతుంటే.. దానికి బలమైన కౌంటర్ ఇవ్వాల్సింది పోయి.. ఆత్మరక్షణలో పడినట్లుగా ఉండటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు సంచలన హత్యలు చోటు చేసుకున్నప్పుడు వాటిని డీల్ చేసే విషయంలో చంద్రబాబు వెనుకపడ్డారన్న మాట బలంగా వినిపిస్తోంది.