చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దు... పిటిషన్లు వాయిదా!

స్కిల్ డవలప్‌ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

Update: 2023-09-13 08:10 GMT

స్కిల్ డవలప్‌ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబును ఏదో రకంగా బయటకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆయన లాయర్లు వరుసపెట్టి పిటిషన్లు వేస్తూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో సరైన సాక్ష్యాలు లేకుండానే జ్యుడిషియల్ రిమాండ్ విధించారంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు లాయర్లు.

ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇదే సమయంలో యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13, ఐపీసీ 409లు చెల్లవని.. రాజకీయ ప్రతీకారంతోనే కేసు పెట్టారని పిటిషన్‌ లో పేర్కొన్నారు. అదేవిధంగా... క్వాష్ పిటిషన్‌ పై విచారణ ముగిసే వరకూ ఏసీబీ కోర్టులో విచారణ ఆపాలని కోరారు.

దీంతో ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీ సీఐడీ, చంద్రబాబు తరుపు న్యాయవాదుల వాదనలు విన్నది. అనంతరం ఈ క్వాష్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా వేసింది. అవును... చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఈ నెల 19కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ఇదే సమయంలో 17ఏ సెక్షన్‌ పై వాదనలు వినిపిస్తానని చెప్పిన బాబు తరుపు న్యాయవాది లూథ్రా... అరెస్ట్‌ పై గవర్నర్‌ అనుమతి కావాల్సిందేనని తెలిపారు. అయితే ముందు సీఐడీ నుంచి కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు అవ్వనివ్వాలని న్యాయమూర్తి సూచించారు. దీంతో సీఐడీ తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి... కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని అడిగారు.

ఇలా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంపై చంద్రబాబు తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై స్పందించిన ధర్మాసనం... పూర్తి వాదనలు వినాల్సి ఉందని పేర్కొంటూ ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఇదే సమయంలో సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు లాయర్లు కోరగా.. సెప్టెంబర్ 18 వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఏపీహైకోర్టు ఆదేశించింది.

ఇలా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై విచారణ ఈనెల 19కి వాయిదా పడగా... మరోవైపు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌ పై ఈనెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదే సమయంలో రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.!

హైకోర్టులో వాదనల సందర్భంగా ఆసక్తికర చర్చ:

ఈ రోజు హైకోర్టులో వాదనల సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇందులో భాగంగా... అర్జంటుగా పిటిషన్‌ పై వాదనలు వినాలని చంద్రబాబు లాయర్‌ లుథ్రా, న్యాయమూర్తిని కోరారు. దీనిపై స్పందించిన జడ్జి... గతంలో తాను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గా పని చేశానని, ఒక కేసులో కౌంటర్‌ కూడా దాఖలు కాకుండా వాదనలు ఎలా వినాలని సూటిగా అడిగారు.

ఇదే సమయంలో మీకేమైనా అభ్యంతరాలుంటే కేసును వేరే బెంచ్‌ కు మారుస్తామని హైకోర్టు న్యాయమూర్తి.. చంద్రబాబు లాయర్ ని సూటిగా అడిగారు. దీంతో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని లూథ్రా సైలంట్ అయిపోయారు! దీంతో కౌంటర్ దాఖలు అనంతరం పూర్తి వాదన్లు వింటామని చెప్పిన జడ్జి... ఇలా 19కి వాయిదా వేశారు!

Tags:    

Similar News