ఏపీలో మరో మంట.. చంద్రబాబు ఆందోళన దేనికి?
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్తాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఇప్పటికే ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసతో రాష్ట్రం సహా దేశం కూడా.. ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిని అదుపు చేయలేక పోయిన.. పోలీసులు వివరణలు ఇచ్చుకునే పరిస్థితికి చేరుకున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు మరో రాజకీయ మంట కాక రేపుతోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్తాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ''అలా చేయకుండా ఆపండి'' అంటూ ఆయన నేరుగా గవర్నర్ నజీర్‌కు లేఖలు రాశారు.
ఏం జరిగింది?
ఏపీ ప్రభుత్వం తన కార్యకలాపాలను అన్నింటినీ.. 'ఈ-ఆఫీస్' పేరుతో నిర్వహిస్తున్న విషయం తెలిసిం దే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఫైళ్లు, ప్రాజెక్టుల వివరాలు.. ఇలా అన్నీ కూడా ఈ 'ఈఆఫీస్‌లోనే భద్ర పరుస్తారు. ఇది ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఆధ్వర్యంలోను.. ఆయన అనుమతి ఇచ్చిన అధికా రుల సమక్షంలోనే నిర్వహిస్తున్నారు. నేరుగా మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలను కూడా దీనిలోనే పేర్కొంటారు.
'ఈ-ఆఫీస్' అనేది చంద్రబాబు హయాం నుంచి కూడా ఉంది. అయితే.. ఇప్పుడు ఈ 'ఈ-ఆఫీస్'ను ప్రక్షా ళన చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. వార్తలు మాత్రం వస్తున్నాయి. ఈ వ్యవహారమే రాజకీయంగా మంటలు రేపుతోంది. ప్రక్షాళన పేరుతో ఈ -ఆఫీస్‌లో నిక్షిప్తం చేసిన ప్రభుత్వ నిర్ణయాలు, అనుమతులు, ఫైళ్లు వంటి వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితం వస్తుందన్న సూచనలు అందుతున్నాయని.. అందుకే.. దీనిని ప్రక్షాళన చేసి.. వివాదాస్పద నిర్ణయాలు, ప్రాజెక్టులను ధ్వంసం చేసేందుకు.. ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొంటున్నారు. ఈ-ఆఫీస్ మూసివేత, ప్రక్షాళన వంటి పనులను తక్షణమే నిలుపుదల చేసేలా ఆదేశించాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు లేఖలు రాశారు. ఆయన నుంచి తమకు సమాధానం రాకపోతే.. కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.