చంద్రయాన్-3: ఆ 14 రోజుల తర్వాత పరిస్థితి ఏంటి?
14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్ పనిచేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా?.. భూమిపై 14 రోజుల కాలం చంద్రుడిపై ఒక్క రోజుతో సమానం
భవిష్యత్తులో భూమికి ఎలాంటి విపత్తు అయినా సంభవిస్తే సురక్షిత గమ్యస్థానంగా చంద్రుడిని మార్చుకోవాలన్న ఆలోచనలు మానవాళికి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో దేశాలు చంద్రుడి గుట్లుమట్లను తెలుసుకునేందు రాకెట్లను పంపాయి. అయితే ఇందులో నాలుగు దేశాలే ఇప్పటివరకు విజయం సాధించాయి. అమెరికా, రష్యా, చైనా, భారత్ మాత్రమే చంద్రుడిపైన ల్యాండర్ ను దించగలిగాయి. ఇక భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను దించిన ఏకైక దేశంగా రికార్డులు సృష్టించింది.
ఈ నేపథ్యంలో చంద్రుడిపై అసలు ఏమున్నాయి? విశ్వం ఆవిర్బావం, సూర్య, చంద్రుల ఆవిర్భావం, జాబిల్లిపై ఏయే ఖనిజ వనరులు ఉన్నాయి తదితర అంశాలను తెలుసుకోవడానికి చంద్రయాన్-3 లో పంపిన ల్యాండర్, అందులోని ప్రజ్ఞాన్ రోవర్ ఉపయోగపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే రోవర్.. ల్యాండర్ నుంచి బయటకు వచ్చి తన పనిని మొదలుపెట్టింది.
కాగా చంద్రుడిపై దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు వెళ్లిన చంద్రయాన్ -3 జీవిత కాలం 14 రోజులే. చంద్రుడిపై సూర్యరశ్మి పడితేనే.. ఆ పడిన సమయంలోనే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ విధులను నిర్వర్తించగలవు. సూర్యరశ్మి లేకపోతే మైనస్ డిగ్రీల మంచులో అవి పనిచేయడం కష్టమవుతాయి. ఈ నేపథ్యంలో సోలార్ శక్తిని సంగ్రహించుకుని అవి పనిచేసేలా ఇస్రో వాటిని రూపొందించింది.
14 రోజులు మాత్రమే ల్యాండర్, రోవర్ పనిచేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా?.. భూమిపై 14 రోజుల కాలం చంద్రుడిపై ఒక్క రోజుతో సమానం. అంటే జాబిల్లి లెక్క ప్రకారం.. ల్యాండర్, రోవర్ అక్కడ ఒక్క రోజు మాత్రమే ఉంటాయి. చందమామపై ఒక్క రోజు తర్వాత వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారుతుందని చెబుతున్నారు. చంద్రుడిపై ఈ ఒక్క రోజు అక్కడ సూర్యుడు అస్తమిస్తాడు. దీంతో మన మాదిరిగానే చంద్రుడిపైన చీకట్లు కమ్ముకుంటాయి. దీంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయి. ఏకంగా మైనస్ 180 డిగ్రీలకు ఉష్ణోగత్రలు దిగజారతాయి.
ఈ నేపథ్యంలో మన లెక్క ప్రకారం భూమిపై 14 రోజులు చంద్రుడిపై ఒక్క రోజుకు సమానం కాబట్టి సూర్యుడు అస్తమించాక అక్కడ మొత్తం కారు చీకట్లు కమ్ముకుంటాయి. ఉష్ణోగ్రతలు కూడా మైనస్ 180 డిగ్రీలకు పడిపోవడంతో ఈ ప్రభావం ల్యాండర్, రోవర్ లపైన పడతాయి. ఈ రెండూ మంచులో గడ్డ కట్టుకుపోతాయి. మళ్లీ తిరిగి 14 రోజుల తర్వాతే చంద్రుడిపై సూర్యుడి కిరణాలు ప్రసరిస్తాయి. అప్పటికే గడ్డ కట్టుకుపోయి మంచులో కూరుకుపోయిన ల్యాండర్, రోవర్ అదృష్టవశాత్తూ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తే అది అద్భుతమే అవుతుంది.
కాగా చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగిన విక్రమ్ ల్యాండర్, దాని నుంచి బయటకు వచ్చి చంద్రుడిపైన తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే తమ పనిని ఆరంభించాయి. పలు ఫొటోలను, వీడియోలను అవి భూమికి పంపాయి. 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపైన తిరుగుతూ అనేక వివరాలను భూమికి పంపనున్నాయి. వీటి ఆధారంగా చంద్రుడిపై ఉన్న ఖనిజ వనరుల వివరాలు, జీవం ఉనికికి అవకాశాలు, విశ్వం ఆవిర్భావం తదితర అంశాలను తెలుసుకోవడానికి వీలు పడుతుందని భావిస్తున్నారు.