200 యూనిట్ల తర్వాత ఒక్క యూనిట్ పెరిగితే.. ఎంత కట్టాలంటే?

గ్యాస్ బండ రూ.500లకు అందజేస్తామన్న దానిపై ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కానీ.. లెక్కలన్ని గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం మీదనే ఉన్నాయి.

Update: 2024-02-29 04:39 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ హామీల్ని అమలు చేస్తామని.. అందుకు వంద రోజుల గడువు మాత్రమే తీసుకుంటామని చెప్పటం తెలిసిందే. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చి రాగానే రెండు హామీల్ని అమల్లోకి తీసుకొచ్చిన రేవంత్ సర్కారు.. ఇప్పుడు మరో రెండు హామీల అమలుకు తెర తీయటం తెలిసిందే. గ్యాస్ బండ రూ.500లకు అందజేస్తామన్న దానిపై ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కానీ.. లెక్కలన్ని గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకం మీదనే ఉన్నాయి. 200 యూనిట్ల లోపు.. 200 యూనిట్ల వరకు నెలలో ఖర్చు చేస్తే బిల్లు సున్నా. మరి.. 201 యూనిట్లు అయితే లెక్కేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీనికి క్లారిటీ ఇస్తున్న అధికారులు.. 200 యూనిట్ల వరకు ఉచితమే అయినా.. 30 రోజుల మొత్తం వాడకం 201యూనిట్లుగా నమోదైతే.. పథకానికి భిన్నంగా ఒక్క యూనిట్ వాడినా.. మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుందని తేల్చారు. 200 యూనిట్లుదాటితే టారిఫ్ మారిపోయి.. బిల్లు తడిచి మోపెడవుతుందని చెబుతున్నారు. గృహజ్యోతి పథకాన్ని తెల్ల రేషన్ కార్డు లేదంటే ఆహార భద్రత కార్డులున్న వారంతా మార్చి 2 తేదీన జారీ చేసే బిల్లు ద్వారా లబ్థి పొందే వీలుంది.

గడిచిన నెల రోజుల్లో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు తీసి చేతికి ఇస్తారు. ఇంతకూ అదనంగా ఖర్చు చేసిన ఒక యూనిట్ కు ఎంత బిల్లు పడుతుంది? దానికి లెక్కలు ఎలా వేస్తారు? అన్న సందేహం పలువురికి ఉంది. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో సెలూన్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక షాపు 400 యూనిట్లు వాడితే.. మొదటి 250 యూనిట్లకు ఉచిత పథకంలో భాగంగా తీసేస్తారు. ఖర్చు చేసిన 400యూనిట్లలో ఉచితంగా ఇచ్చే 250యూనిట్లను తీసేసి.. మిగిలిన 150 యూనిట్లకు బిల్లు వేస్తారు. ఈ లెక్కన గృహజ్యోతి వినియోగదారుల సంగతేమిటి? అన్న సందేహం రావొచ్చు.

ఈ పథకంలోని లబ్థిదారులకు 200 యూనిట్లకు ఒక్క యూనిట్ అదనంగా వాడినా.. మొత్తం 201 యూనిట్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సెలూన్లకు వర్తించేలా గృహజ్యోతి ఉచిత విద్యుత్తు పథకం కింద మాత్రం ఆ తీరులో లెక్కలు వేయరని చెబుతున్నారు. 200 యూనిట్లలోపు యూనిట్‌కు రూ.4.80గా ఉండే టారిఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోతుంది. సో.. 200 యూనిట్ల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి లేదంటే.. ఏమీ కట్టాల్సిన అవసరం లేని స్థితి నుంచి భారీగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.


Full View


Tags:    

Similar News