చికెన్ గున్యా ఖతం.. తొలి వ్యాక్సిన్ కు అమెరికా ఆమోదించింది
ఇప్పుడు చికెన్ గున్యా అంతం చూసేందుకు, ఈ రోగాన్ని పూర్తిగా రూపు మాపే దిశగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
చికెన్ గున్యా.. ఏడిస్ ఈజిప్టీ అనే రకం దోమ ద్వారా మనుషులకు సోకే వ్యాధి ఇది. విపరీతమైన కీళ్ల నొప్పులు, తీవ్రమైన జ్వరం దీని ప్రధాన లక్షణాలు. చికిత్సతో ఈ వ్యాధి తగ్గుతుంది. కానీ ఒక్కోసారి ప్రాణాంతకంగా మారి ప్రజల ప్రాణాలనూ హరిస్తుంది. ఇది టోగోవిరిడే కుటుంబానికి చెందిన ఆల్ఫా వైరస్ వల్ల కలిగే విష జ్వరం ఇది. దీని వ్యాప్తి ఎక్కువే. అన్ని వయసుల వారికి ఇది సోకుతుంది. ఇప్పుడు చికెన్ గున్యా అంతం చూసేందుకు, ఈ రోగాన్ని పూర్తిగా రూపు మాపే దిశగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
దోమల ద్వారా వ్యాపించే చికెన్ గున్యా వ్యాధిని నిరోధించేందుకు మొట్టమొదటి వ్యాక్సిన్ కు ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్ ను అమెరికా ఆమోదించింది. ప్రపంచంలో ఇదే తొలి చికెన్ గున్యా టీకా. ఐరోపాకు చెందిన వాల్నేవా కంపెనీ ఈ టీకాను డెవలప్ చేసింది. ఇప్పుడీ టీకాను ఇక్ష్ చిక్ పేరుతో తీసుకొస్తున్నారు. అయితే 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం ఇది అందుబాటులోకి రానుంది.
ఈ టీకా అందుబాటులోకి వస్తే చికెన్ గున్యాను శాశ్వతంగా అంతమొందిచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యాక్సిన్ కు ఆమోదం లభించడాన్ని కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 15 ఏళ్లలో 50 లక్షలకు పైగా చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు వ్యాధి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.