రేవంత్ రైఫిల్ రెడ్డి అయితే.. కౌశిక్ మానుకోట ముత్యమా కేసీఆర్?

సాధారణ సమయంలో కంటే ఎన్నికల కాలంలో నాయకులు చేసే విమర్శలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది

Update: 2023-11-20 15:30 GMT

సాధారణ సమయంలో కంటే ఎన్నికల కాలంలో నాయకులు చేసే విమర్శలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ ముఖ్య నాయకులు చేసే ఆరోపణలు విమర్శలకు మరింత విలువ పెరుగుతుంది. యథాలాపంగా చేసినా, ఉద్దేశిస్తూ చేసినా, వాటికి విపరీతమైన ప్రాధాన్యం దక్కుతుంది. కొన్నిసార్లు అవి నెట్టింట్లో ట్రోలింగ్ కు.. మీమ్స్ కూ కారణం అవుతాయి. ఇలాంటిదే ప్రస్తుతం ఓ విమర్శ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అది చేసింది కూడా సాక్షాత్తు తెలంగాణ సీఎం కేసీఆర్ కావడంతో మరింత ప్రాచుర్యం పొందింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల కిందట చేర్యాలలో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని రైఫిల్ రెడ్డి అంటూ సంబోధించారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రైఫిల్ తీసుకుని ఉద్యమకారుల మీదకు వెళ్లారని.. అప్పటినుంచి ఆయనను రైఫిల్ రెడ్డిగా పిలుస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తికి భయపడవద్దని.. తెలంగాణ కోసం పోరాడిన మన్నల్ని ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలకు రైఫిల్ తో రేవంత్ కారు ఎక్కుతున్న వీడియోను జత చేసి సోషల్ మీడియాలో ఉంచారు. అయితే, దీనికి కౌంటర్ గానూ కొందరు విశ్లేషకులు వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు.

రేవంత్ రైఫిల్ రెడ్డి అయితే.. ప్రస్తుతం కేసీఆర్ వెంట ఉన్నవారు ఎవరని.. తెలంగాణ ఉద్యమ సమయంలో వారంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చేపట్టిన ఓదార్పు యాత్ర సందర్భంగా మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు రువ్విన ఘటనను గుర్తుచేస్తున్నారు. అందులోనూ ఈ ఘటనలో ప్రస్తుత హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఈ మానుకోట ఘటన ప్రస్తావన తరచూ వస్తుంటుంది. జగన్ మానుకోట వస్తున్నారని తెలిసి.. అక్కడి రైల్వే స్టేషన్ లో జగన్ మద్దతుదారులు, తెలంగాణవాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం చూస్తే రైల్వే స్టేషన్ మొత్తం రాళ్లతో నిండిపోయింది. తాజాగా అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసీఆర్ చేసిన కామెంట్లను ప్రస్తావిస్తున్నారు.

మరి కౌశిక్ ఎవరు?

రేవంత్ రైఫిల్ రెడ్డి అయితే.. ఉద్యమకారులపైకి ఆందోళనకారులను ఉసిగొల్పిన కౌశిక్ రెడ్డి ఎవరని సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంతేకాక పలు సందర్భాల్లో కౌశిక్ వ్యాఖ్యలు, బీసీ వర్గాన్ని ఉద్దేశించి చేసిన పరుష వ్యాఖ్యలను కూడా ట్రోల్ చేస్తున్నారు. అంతేగాక.. మొన్నటివరకు కాంగ్రెస్ లో ఉన్న కౌశిక్ రెడ్డిని.. కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ లోకి తీసుకోవడమే కాక, ఎమ్మెల్సీని చేయడాన్నీ ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నికలో ఓడిపోయే పరిస్థితుల్లో బీసీ అభ్యర్థి, తొలినుంచి బీఆర్ఎస్ లో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇచ్చి.. నియోజకవర్గంలో పరిణామాలు కాస్త అనుకూలంగా ఉన్న సందర్భంలో కౌశిక్ కు టికెట్ ఇవ్వడం ఏమిటని నిలదీస్తున్నారు. రేవంత్ రైఫిల్ రెడ్డి అయితే.. కౌశిక్ రెడ్డి మానుకోట ముత్యమా? అని కూడా ఎద్దేవా చేస్తున్నారు.

Tags:    

Similar News