ఈ కులం ఓట్లు కేసీఆర్ కు అవసరం లేదా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంచలనం సృష్టించారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంచలనం సృష్టించారు. అధికారం కోసం పోటీ పడుతున్న మరో రెండు పార్టీలు కాంగ్రెస్, బీజేపీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ఆయన సమర శంఖం పూరించారు. మరో నాలుగు స్థానాలకు మాత్రమే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
కాగా కేసీఆర్ ప్రకటించిన సీట్లలో రెడ్డి సామాజికవర్గానికే అత్యధికంగా 40 సీట్లు దక్కాయి. బీసీలకు 23 సీట్లు మాత్రమే కేటాయించారు. మాదిగలకు 11, మాలలకు 8, నేతకాని 1, కమ్మలకు 5, వెలమలకు 11 సీట్లు కేటాయించారు.
అయితే కేసీఆర్ ప్రకటించిన జాబితాలో కొన్ని ప్రధాన సామాజికవర్గాలకు సీట్లు దక్కకపోవడం గమనార్హం. ముఖ్యంగా తెలంగాణలో ప్రధాన కులాల్లో ఒకటైన ముదిరాజ్ లకు కేసీఆర్ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఇది చర్చకు దారితీసింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ పలు సందర్భాల్లో తెలంగాణలో ముదిరాజ్ ల జనాభా 60 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. మరి ఇంత భారీ సంఖ్యలో జనాభా ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి కేసీఆర్ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం గమనార్హం.
అయితే కేసీఆర్ నిర్ణయానికి కారణాలు లేకపోలేదని అంటున్నారు. ఈసారి ముదిరాజులంతా బీజేపీ తెలంగాణ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కు అనుకూలంగా ఉన్నారని.. ఈ మేరకు కేసీఆర్ కు సర్వే నివేదికలు అందాయని అంటున్నారు. ఈటల రాజేందర్ కూడా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారే. ఈటలను కేసీఆర్ అవమానించి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, వేధింపులకు గురిచేయడం ఆ వర్గానికి నచ్చలేదని టాక్.
దీంతో వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ సామాజికవర్గం కేసీఆర్ కు గట్టి షాక్ ఇవ్వడానికి నిశ్చయించుకుందని.. ఈ మేరకు కేసీఆర్ కు సర్వే నివేదికలు అందడంతోనే ముదిరాజ్ లకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కూడా ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినవారే. ఆ సామాజికవర్గంలో ఆయనకు గట్టి పట్టు ఉందని అంటున్నారు. ముదిరాజ్ ల్లో ఎక్కువ మంది ఈటల రాజేందర్ (బీజేపీ) వైపు, మరికొంతమంది కాసాని జ్ఞానేశ్వర్ (టీడీపీ) వైపు నిలిచే అవకాశం ఉండటంతోనే కే సీఆర్ ముదిరాజ్ కమ్యూనిటీని లైట్ తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో గెలుపుఓటములను ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న ముదిరాజులను దూరం చేసుకోవడం కేసీఆర్ కు నష్టమేనని అంటున్నారు. దీని ఫలితం వచ్చే ఎన్నికల తర్వాత కానీ వెల్లడి కాదు. అప్పటిదాకా వేచిచూడాల్సిందే.