చైనా చేసిన పని కరోనా కంటే డేంజర్!
ఈ విషయంలో నిపుణులు, ప్రపంచ పర్యావరణ ప్రముఖులు హెచ్చరిస్తున్నా చైనా లెక్కచేయడం లేదు.
ప్రపంచంలో అమెరికాను తలదన్ని ఏకైక సూపర్ పవర్ గా నిలవాలన్న ఆకాంక్షతో ఆసియా దేశం.. చైనా చేస్తున్న పనులు, చేపడుతున్న ప్రాజెక్టులు మానవాళికి తీరని నష్టాన్ని కలిగించబోతున్నాయి. ఈ విషయంలో నిపుణులు, ప్రపంచ పర్యావరణ ప్రముఖులు హెచ్చరిస్తున్నా చైనా లెక్కచేయడం లేదు.
చైనాలో యాంగ్జీ నదిపై ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ ను చైనా నిర్మించిన సంగతి తెలిసిందే. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే కనిపించే అతి తక్కువ కట్టడాల్లో ఈ డ్యామ్ కూడా ఉండటం విశేషం. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న 14 లక్షల మందికి ఆ దేశం పునరావాసం కల్పించింది.
యాంగ్జీ నదిపై 2.33 కిలోమీటర్ల పొడవునా, 181 మీటర్ల ఎత్తులో త్రీ గోర్జెస్ డ్యామ్ ను నిర్మించాలని చైనా తలపెట్టింది. ఈ ప్రాజెక్టును 1994లో ప్రారంభించింది. 12 ఏళ్ల పాటు నిర్మాణ పనులు జరిగాయి. చివరకు 2006లో త్రీ గోర్జెస్ డ్యామ్ పూర్తయింది. దీని నిర్మాణం కోసం ఏకంగా 1,680 గ్రామాలను, 114 పట్టణాలను చైనా కూల్చివేయడం గమనార్హం.
అలాగే త్రీ గోర్జెస్ డ్యామ్ లో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ ప్రపంచంలోనే మూడు అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్ కు సమానం కావడం గమనార్హం. త్రీ గోర్జెస్ డ్యామ్ ద్వారా 22,500 మెగావాట్లు జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
త్రీ గోర్జెస్ డ్యామ్ కు ఏకంగా మూడు నదుల నుంచి నీరు వస్తోంది. ఈ డ్యామ్ ద్వారా సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీరు నిల్వ చేస్తారు. ఇప్పుడు దీనిపైనే పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. అంతభారీ మొత్తంలో ఒకేచోట నీరు నిల్వ చేయడం ప్రమాదకరం అంటున్నారు. ఈ డ్యామ్ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇది భూమి గమనంపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.
అమెరికాకు చెందిన నాసా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాంగ్జీ నదిలో భారీ పరిమాణంలో నీరు నిల్వ చేయడంతో భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గిపోయిందని ఆ డ్యామ్ నిర్మించినప్పుడే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనివల్ల సూర్యుడి నుంచి భూమి ప్రస్తుతం ఉన్న దూరం నుంచి 2 సెంటీమీటర్ల మేర దూరం కూడా జరిగిందని తెలిపారు. ఇక్కడితో ఇది ఆగలేదని.. దీని ప్రభావం ఇంకా పెరుగుతూనే ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూమి అంత: పొరల్లో ఏమైనా భారీ మార్పులు చోటు చేసుకుంటే దాని ప్రభావం భూగమనంపై పడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో హిందూ మహా సముద్రంలో సునామీ వచ్చినప్పుడు సైతం భూగమనంలో మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. ఈ సునామీ ప్రభావంతో ఒక రోజు నిడివి దాదాపు 2.68 మైక్రోసెకెన్లు తగ్గిపోయిందని అంటున్నారు. ఇప్పుడు త్రీ గోర్జెస్ డ్యామ్ వల్ల ఇలాంటి పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ లక్షల మంది చైనాలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరదలు పెరిగితే ఆ డ్యామ్ లో ఉన్న నీటిని కిందకు వదిలితే దిగువ ప్రాంతాలు నాశనం కాక తప్పదనే భయాలు సైతం ఉన్నాయి.