భారత్ పై చైనా మరో కుట్ర.. కఠిన చర్యలకు భారత్ సిద్ధం!
మిత్ర దేశాల్లో భారత్ పై వ్యతిరేక ప్రచారం చేయడం, భారత్ లో చైనాకు అనుకూలంగా ప్రచారం చేయడం వంటి పనులు ఈ మీడియా సంస్థలు చేస్తున్నాయని నిఘా సంస్థలు గుర్తించాయి.
భారత్ పై చైనా విషం కక్కుతూనే ఉంది. సరిహద్దుల్లో భారత దళాలను నిత్యం కవ్వించడమే పనిగా పెట్టుకున్న చైనా.. భారత్ పై మరో కుట్రకు తెగబడింది. ఈ విషయాన్ని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. కొన్ని భారత మీడియా సంస్థలకు చైనా పెద్ద ఎత్తున నిధులు అందజేస్తోందని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఈ మీడియా సంస్థలకు నిధులు అందజేయడం ద్వారా దేశ ఆర్థిక, రాజకీయ, సైనిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు చైనా భంగం కలిగిస్తోందని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి.
మిత్ర దేశాల్లో భారత్ పై వ్యతిరేక ప్రచారం చేయడం, భారత్ లో చైనాకు అనుకూలంగా ప్రచారం చేయడం వంటి పనులు ఈ మీడియా సంస్థలు చేస్తున్నాయని నిఘా సంస్థలు గుర్తించాయి. అంతేకాకుండా ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించాయి. ఆయా మీడియా సంస్థల ప్రతినిధులకు చైనా నుంచి భారీగా నిధులు అందుతున్నట్టు గుర్తించాయి. ఈ నేపథ్యంలో చైనా నిధులతో నడుస్తున్న భారత మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ఇప్పటికే దేశ జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారారనే ఆరోపణలతో డజనుకుపైగా భారతీయ సోషల్ మీడియా ఖాతాలను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. చైనా ప్రభుత్వ కథనాలను పోస్టు చేస్తూ భారత ప్రభుత్వం విషం చిమ్ముతున్నారని సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెనర్స్ ల ఖాతాలపై భారత ప్రభుత్వం వేటేసింది. ఆ ఖాతాలను స్తంభింపజేసింది. ఈ క్రమంలో చైనా అనుకూల కథనాలను పోస్టు చేస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ లు, వ్లాగర్ లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. చైనాకు అనుకూలంగా భారత్ లో నడుస్తున్న యూట్యూబ్ చానెళ్లు, వ్లాగర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల సమగ్ర జాబితాను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. వీటిలో కొన్నింటిపై ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఆ యూట్యూబ్ చానెళ్లను, సోషల్ మీడియా ఖాతాలను, వ్లాగర్ల చానెళ్లను నిలిపి వేసింది.
చైనా నిధులతో దేశంలో నడుస్తున్న మీడియా సంస్థలు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు, వ్లాగర్లు ఆ దేశానికి సమాచారం అందిస్తున్నారని.. తద్వారా దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరంగా మారారని నిఘా సంస్థలు గుర్తించాయి.
ఇటీవల ఇనస్టంట్ లోన్ యాప్స్ నిర్వాహకుల్లోనూ చాలామంది చైనావారేనని వెల్లడైంది. ఆన్ లైన్ ద్వారా మనదేశంలో పెద్ద ఎత్తున యువతను లోన్ యాప్స్ ఏజెంట్లుగా నియమించుకుని లోన్స్ రూపంలో భారీ ఎత్తున దండుకుంటున్నారని వెల్లడైంది. అంతేకాకుండా ఎంతో మంది యువతను ఆన్ లైన్ లో వేధించి వారి ప్రాణాలు పోవడానికి కారకులయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లు, యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నారని.. భారత ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం, ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయడంటి వంటివి చేస్తున్నారని నిఘా సంస్థలు గుర్తించాయి, ఈ నేపథ్యంలో వారి ఆటకట్టించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.