చైనాలో మరో కల్లోలం.. ఈసారి ఇలా!
'వన్ నేషన్ – వన్ చైల్డ్' పేరుతో కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. గట్టిగా కుటుంబ నియంత్రణ చర్యలు అమలు చేసింది.
ఇటీవల వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. చైనా కంటే అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించింది.
చైనాలో గతేడాది జననాలు మరో 10 శాతం క్షీణించాయి. దీంతో ఆ దేశంలోనే అత్యల్ప జననాలు సంభవించిన ఏడాదిగా 2022 రికార్డు నమోదు చేసింది. జనాభా అసమతుల్యత సమస్యను ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జననాల సంఖ్య పెరగడం లేదు. 2022లో చైనాలో కేవలం 95.6 లక్షల మంది మాత్రమే చిన్నారులు జన్మించినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ ప్రచురించిన తాజా నివేదిక వెల్లడించింది.
1949 నుంచి నమోదవుతున్న రికార్డుల్లో ఇదే అత్యల్ప సంఖ్య కావడం గమనార్హం. ఇక గతేడాది పుట్టిన చిన్నారుల్లో దాదాపు 40 శాతం మంది రెండో సంతానమే. 15 శాతం మంది మూడు లేదా అంతకంటే అధిక సంతానమని తేలింది.
కాగా చైనా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడానికి అప్పట్లో తీవ్ర చర్యలు చేపట్టింది. ‘వన్ నేషన్ – వన్ చైల్డ్’ పేరుతో కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. గట్టిగా కుటుంబ నియంత్రణ చర్యలు అమలు చేసింది. ఒకరి కంటే ఎక్కువ మంది బిడ్డలను కంటే ప్రభుత్వ పథకాలు ఎత్తేయడం వంటివి చేపట్టింది. మూడు దశాబ్దాలపాటు 1980–2015 వరకు వల్ చైల్డ్ పాలసీని చాలా కఠినంగా అమలు చేసింది. దీంతో చైనా జనాభా వృద్ధి రేటు పడిపోయింది.
కాగా ప్రస్తుతం చైనాలో ఉన్న జనాభాలో యువతరం కంటే వృద్ధులే ఎక్కువ. దీంతో దేశ ఉత్పాదకత పడిపోతోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే నిష్ణాతులైన యువత అవసరం. ఈ నేపథ్యంలోనే చైనా మళ్లీ జనాభా పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇందుకోసం న్యూ ఎరా (కొత్త యుగం) పేరిట ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెళ్లిళ్లు, సంతానోత్పత్తి, జననాల వృద్ధి రేటును పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. దేశంలోని 20కి పైగా నగరాల్లో మొదట పైలట్ ప్రాజెక్టుగా న్యూ ఎరాను చేపట్టనుంది.
దేశంలోని 20 నగరాల్లో పెళ్లిళ్లు, సంతానోత్పత్తిని పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టనుంది. మహిళలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనేలా వారిని ప్రోత్సహిస్తారు. పిల్లల బాధ్యతలను దంపతులు ఇద్దరూ కలిసి పంచుకునేలా భార్యాభర్తలు ఇద్దరికీ అవగాహన కల్పిస్తారు.
మరోవైపు చైనాలోని పలు రాష్ట్రాల్లో జననాల రేటు పెంచేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా పన్ను రాయితీలు, గృహాలపై సబ్సిడీలు, మూడో బిడ్డను కంటే రాయితీతో కూడిన విద్య వంటి సౌకర్యాలు అందిస్తున్నాయి.
అయితే జనాభాను పెంచడానికి చైనా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడి మహిళలు మాత్రం పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదని సమాచారం. జీవన వ్యయాలు విపరీతంగా పెరిగిపోవడం, ఇతర ఖర్చులు భరించలేని స్థాయిలో ఉండటంతో పిల్లలను కనడానికి, పెళ్లిళ్లు చేసుకోవడానికి అక్కడి యువత మొగ్గు చూపడం లేదని అంటున్నారు.
దీంతో చైనా ప్రపంచంలోనే ధనిక దేశం కాక ముందే, వృద్ధ దేశంగా మారుతోందని డ్రాగన్‌లో కలవరం మొదలైంది. వృద్ధ జనాభా పెరగడంతో ఆరోగ్యం, సంక్షేమంపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడంతో ఆదాయం తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో వేచిచూడాల్సిందే.