10 పీఎం – 6 ఏఎం నో ఫోన్... చైనా కీలక నిబంధనలు.?
ఈ సమయంలో ఏ వయసు పిల్లలు ఎంతెంత టైం స్మార్ట్ ఫోన్ వాడాలి అనే విషయం పై చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్ (సీఏసీ) కీలక నిర్ణయం తీసుకొంది.
నేటి కాలం లో సామాన్యులకు స్మార్ట్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిన సంగతి తెలిసిందే. ఫోన్ చేతి లో ఉంటే ప్రపంచం పాకెట్ లో ఉన్నట్లుగా మారిపోయాయి పరిస్థితులు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రలోకి జారుకునే చివరి సెకను వరకూ స్మార్ట్ ఫోన్ తో గడిపేవారికి కూడా కొదవ లేదని అంటుంటారు. ఈ సమయంలో చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్ కీలక నిర్ణయం తీసుకుంది!
అవును... స్మార్ట్ ఫోన్ కు ఎంతోమంది బానిసలుగా మారిపోతున్నారని అంటుంటారు. ఇదే సమయంలో పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్ లకు బానిసలైన వారు చాలా మంది ఉన్నారని అంటుంటారు. ఈ మేరకు వైద్యులను సంప్రదిస్తోన్న తల్లితండ్రులు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఈ సమయంలో ఏ వయసు పిల్లలు ఎంతెంత టైం స్మార్ట్ ఫోన్ వాడాలి అనే విషయం పై చైనా సైబర్ స్పేస్ రెగ్యులేటర్ (సీఏసీ) కీలక నిర్ణయం తీసుకొంది.
ఈ క్రమంలో... వయస్సు వర్గీకరణ రూపకల్పన ను ఐదు రకాలుగా విభజించింది. ఇందులో భాగంగా 3 సంవత్సరాల లోపు పిల్లలు.. 3 నుంచి 8 ఏళ్ల మధ్య వయస్సుగల బాలబాలికలు.. 8 - 12 ఏళ్ల వారు.. 12 – 16 సంవత్సరాలు.. 16 - 18 సంవత్సరాల వయస్సువారు అంటూ విభజించింది.
వీరిలో 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారుల కోసం మైనర్ మోడ్ ను తీసుకురానుంది. ఇందులో భాగంగా 40 నిమిషాల కంటే ఎక్కువ డిఫాల్ట్ వినియోగ సమయాన్ని సపోర్ట్ చేయకుండా చూస్తోంది. ఇందులో భాగంగా మైనర్ యూజర్ 30 నిమిషాల కంటే ఎక్కువసేపు మొబైల్ ని ఉపయోగించినప్పుడు.. మొబైల్ స్మార్ట్ టెర్మినల్ రిమైండర్ ను జారీ చేయాలని సీఏసీ పేర్కొంది.
ఇదే క్రమంలో... 8 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు కానీ 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఒక గంట మొబైల్ వినియోగానికి పరిమితం చేయబడుతుంది. అదేవిదంగా 16 ఏళ్ల కంటే ఎక్కువ 18 ఏళ్లలోపు వారికి, స్క్రీన్ సమయం రెండు గంటలకే పరిమితం చేయబడుతుంది.
ఇక్కడ అత్యంత కీలకంగా మైనర్ మోడ్ లో ఉన్నవారికి రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు సేవలను అందించడం నిషేధించబడటం గమనార్హం.
ఈ స్థాయి లో సైబర్ స్పేస్ రెగ్యులేటర్ సూచన తరువాత దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నియమాన్ని రూపొందించవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ వార్త ఇంటర్నెట్, టెక్ కంపెనీల లో భయాందోళనలు నెలకొన్నాయని అంటున్నారు. ఈ నిర్ణయం ఫలితంగా తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తోందని వాపోతున్నారని అంటున్నారు.