ఏంది చిరు? ప్రజారాజ్యం జనసేన అయ్యిందా?
ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందని.. అందుకు తనకు సంతోషంగా ఉందన్న ఆయన..తొలిసారి జై జనసేన అంటూ నినాదం చేసిన వైనం సంచలనంగా మారింది.
రాజకీయాలు వద్దు. సినిమాలు ముద్దు. రాజకీయాల గురించి మాట్లాడను అంటూ భీష్మించుకున్న ఆయన.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పెట్టి.. ఒంటరిగా పోరాటం చేసిన సందర్భంలోనూ మాట వరసకు రాజకీయాల గురించి మాట్లాడటం.. జనసేన వెంట మెగా అభిమానులు అంతా ఉండాలని ఒక్క రోజున.. ఒక్క మాట మాట్లాడని మెగాస్టార్.. అందుకు భిన్నంగా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందని.. అందుకు తనకు సంతోషంగా ఉందన్న ఆయన..తొలిసారి జై జనసేన అంటూ నినాదం చేసిన వైనం సంచలనంగా మారింది.
ఈ సరికొత్త పరిణామానికి విష్వక్ సేన్ హీరోగా నటించిన లైలా చిత్ర వేడుక వేదికైంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన చిరంజీవి.. తన ప్రజారాజ్యం పార్టీ అంశాల్ని ప్రస్తావించారు. విష్వక్ సేన్ తండ్రి కరాటే రాజుతో తనకున్న అనుబంధానని గుర్తు చేసుకున్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా ఎదగాలనే తన కోరికను కరాటే రాజు నా దగ్గర ప్రస్తావించారు. దాంతో ప్రజారాజ్యం తరఫున అవకాశం ఇచ్చాం. కానీ అప్పట్లో పరిస్థితులు ఇంకోలా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడున్న జనసేన.. ప్రజారాజ్యమన్న చిరంజీవి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
పవన్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ విషయంలో చిరంజీవి విముఖంగా ఉండటం తెలిసిందే. ఆ మాటకు వస్తే తమ్ముడు రిస్కు చేస్తున్న వైనంలో ఆయన టెన్షన్ పడ్డారు. ఆ మాటకు వస్తే.. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి.. తన రాజకీయ ప్రత్యర్థులతో యుద్ధమే చేసిన సందర్భంలో అన్నగా ఎప్పుడూ తమ్ముడి వెనుక ఉన్నది లేదు. తమ్ముడు పవన్ కు అనుకూలంగా ఒక ట్వీట్ చేసింది లేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం తాను పెట్టిన ప్రజారాజ్యమే ఇప్పటి జనసేన అన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల గురించి మాట్లాడనన్న చిరు.. ఆ మాట మీద ఉంటేనే బాగుంటుందేమో?