అసెంబ్లీకి వెళ్ళి షాక్ తిన్నానన్న చిరంజీవి !
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలసి చిరంజీవి తన అనుభవాలను పంచుకున్నారు.
మెగాస్టార్ గా ఎవరికీ దక్కని అందలాలు ఎక్కిన చిరంజీవి ఇపుడు దేశంలో అతి పెద్ద రెండవ పౌర పురస్కారం పద్మ విభూషణ్ ని అందుకున్నారు. టాలీవుడ్ లో చూస్తే ఆ అవార్డు ని తొలుత అందుకున్నది మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు అయితే ఆ తరువాత తీసుకున్నది మెగాస్టార్ కావడం విశేషం.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలసి చిరంజీవి తన అనుభవాలను పంచుకున్నారు. ఢిల్లీలో ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆత్మీయ భేటీలో కిషన్ రెడ్డిని చిరంజీవి తనకు మంచి మిత్రుడు అని కొనియాడితే చిరంజీవి తెలుగువారు కావడం అందరికీ గర్వ కారణం అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన సినీ జీవిత ప్రస్తానాన్ని రాజకీయ ప్రయాణాన్ని మరోమారు నెమరేసుకున్నారు. తాను ప్రజారాజ్యం పార్టీ తరఫున అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన నాటి అనుభవాలని ఆయన చెబుతూ తొలిసారి అసెంబ్లీకి వెళ్తే అక్కడ లైవ్ లో ఎమ్మెల్యేలు తిట్టుకోవడం చూసి షాక్ తిన్నాను అని అన్నారు. వారిని వీరు వీరిని వారు తిట్లతోనే మాటల యుద్ధం చేసుకుంటూంటే ఇదేంటి అని ఆశ్చర్యపోయాను అన్నారు.
ఇక అసెంబ్లీ లాబీల దగ్గరకు వచ్చేసరికి అలా తిట్టుకున్న వారే ఒకరితో ఒకరు కలసి భుజాల మీద చేతులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న అనుభవలాను కూడా చూసి మళ్ళీ షాక్ తిన్నాను అన్నారు. అక్కడ వారు తమ అధినేతల ముందు అలా తిట్టాల్సి వచ్చిందని చెప్పుకోవడం చూసి ఇదేనా రాజకీయం అనుకున్నాను అన్నారు.
తాను కేంద్ర మంత్రిగా ఉన్నపుడు తనకు ఇచ్చిన టూరిజం శాఖను చక్కగా నిర్వహించాను అన్న సంతృప్తి ఉందని ఆయన చెప్పారు. తాను పదవులకు ఆశపడి పార్టీ పెట్టలేదని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ చేయడానికే అని ఆయన అన్నారు. తనకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేశాను అన్న తృప్తి కలిగింది అని చిరంజీవి చెప్పారు.
సినీ రంగంలో అంచలంచెలుగా ఎదిగిన తాను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను అంటే కళామతల్లి ఇచ్చిన ప్రోత్సాహం దీవెనలు అని చిరంజీవి అన్నారు. ఆ రుణం తీర్చుకోవడానికే ఎవరికైనా సాయం చేయడానికి తాను ముందుకు వస్తానని చిరంజీవి చెప్పారు.
ఇంటికి పెద్ద కుమారుడిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తామో అలాగే సినీ పరిశ్రమకు కూడా పెద్ద కొడుకుగా తన వంతుగా ఎపుడూ సహాయం చేయడానికి బాధ్యతతో ఉంటాను అని ఆయన అన్నారు. తనకు అవార్డులు అన్నవి బాధ్యతను మరింతగా పెంచేవే తప్ప మరోటి కాదని అన్నారు. తనను అన్ని రకాలుగా ఆదరిస్తున్న ప్రజలకు తాను రుణం తీర్చుకోలేను అని ఆయన అన్నారు.