టీడీపీ టార్గెట్ వన్ ఇంట్లో CID సోదాలు!

ఒక్క మద్యంపైనే జగన్‌ ప్రభుత్వం ఏటా 40 వేల కోట్ల రూపాయలు దండుకుంటోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.

Update: 2024-06-07 10:12 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ ఐదేళ్ల పాలనలో తీవ్ర వివాదస్పదమైన అంశం.. మద్యం. వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యాన్ని ప్రభుత్వమే అమ్మించింది. ప్రత్యేకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యపాన నిషేధం కోసమే పరిమిత వేళల్లో దుకాణాలను నడిపేలా తాము ఈ పనిచేస్తున్నామని జగన్‌ ప్రభుత్వం సమర్థించుకుంది. అయితే ఊరుపేరు లేని బ్రాండ్లతో నాసిరకం మద్యం అమ్ముతోందని ప్రతిపక్షాలు, మద్యపాన ప్రియులు ఆరోపణలు చేశారు. అలాగే మద్యం దుకాణాల్లో డిజిటల్‌ పేమెంట్లు లేకుండా కేవలం నగదు మాత్రమే తీసుకోవడంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక్క మద్యంపైనే జగన్‌ ప్రభుత్వం ఏటా 40 వేల కోట్ల రూపాయలు దండుకుంటోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.

ఈ వ్యవహారంలో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వాసుదేవరెడ్డిపైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. జగన్‌ వీరభక్త అధికారుల్లో వాసుదేవరెడ్డి ఒకరని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నిబంధనలను మీరి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్, మద్యం అమ్మకాలపైన కూడా జగన్‌ ప్రభుత్వం అప్పులు తెచ్చుకుందనే విమర్శలు రేగాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావడంతో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ సంస్థ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ సోదాలకు దిగింది. హైదరాబాద్‌ లో నానక్‌ రామ్‌ గూడలో ఉంటున్న వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు చేపట్టిన ఏపీ సీఐడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

జగన్‌ ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే డిస్టిలరీలన్నీ వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. నూతన మద్యం విధానం తేవడం, వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు వాసుదేవరెడ్డిపైన ఉన్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్రానికి కూడా ఫిర్యాదులు చేశారు. జే బ్రాండ్‌ నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలను జగన్‌ ప్రభుత్వం హరిస్తోందని ఫిర్యాదులు కూడా చేశారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ముందుగా మద్యం విధానంపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉండి కొద్దిరోజుల క్రితం పదవి నుంచి తప్పుకున్న వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇంకా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

ఇందులో భాగంగా వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. నాసిరకం మద్యం, కొత్త కంపెనీల ఏర్పాటు, వైసీపీ నేతలకు చెందిన డిస్టిలరీల్లోనే వేల కోట్ల రూపాయల మద్యం కొనుగోలు చేయడం, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ పేమెంట్లు లేకపోవడం వంటి అంశాలపై ఆయనను విచారిస్తున్నట్టు సమాచారం.

Tags:    

Similar News