సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు.. సినిమా హీరో ఫిర్యాదు!

ఈ క్రమంలో ఒక ఫోర్జరీ కేసు తెరపైకి వచ్చింది. సీఎం రమేష్ తమ సంతకాలు ఫోర్జరీ చేసి రూ.450 కోట్లు కొట్టేశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లో కేసు నమోదైంది

Update: 2024-03-24 05:06 GMT

రెండు రోజులుగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పేరు మీడియాలో మారుమ్రోగిపోతున్నట్లే కనిపిస్తుంది. ఇప్పటికే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తాను ఉంటున్న బీజేపీకి ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ కు నిధులు సమకూర్చారని కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఒక ఫోర్జరీ కేసు తెరపైకి వచ్చింది. సీఎం రమేష్ తమ సంతకాలు ఫోర్జరీ చేసి రూ.450 కోట్లు కొట్టేశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లో కేసు నమోదైంది.

అవును... సీఎం రమేష్ ఫోర్జరీ సంతకాలు చేసి రు.450 కోట్లు కొట్టేశారనే వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. షెల్ కంపెనీతో ఎంపీ సీఎం రమేష్, ఆయన సన్నిహితుడు పి.నాగేశ్వర రావు ఈ మోసానికి పాల్పడ్డారంటు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది!

సంతకాలు ఫోర్జరీ చేసి, రిత్విక్ స్వాతీ అనే షెల్ కంపెనీ పేరిట సబ్ కాంట్రక్టు ఒప్పంద పత్రాలు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారని అంటున్నారు. ఈ మేరకు టాలీవుడ్ హీరో, పీసీఎల్ ఇంటర్ టెక్ లెన్ హైడ్రో కన్సార్షియం జాయింట్ వెంచర్ ఆథరైజ్డ్ సిగ్నేచరీగా ఉన్న తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు గత ఏడాదే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... వారిపై ఐపీసీ సెక్షన్ 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు! ఈ సమయంలో... తాజాగా ఈ ఫోర్జరీ సంతకాలతో సీఎం రమేష్ పాల్పడినట్లు చెబుతున్న ఈ మోసానికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలను వేణు, భాస్కర్ రావు లు హైదరాబాద్ పోలీసులకు అందించారని సమాచారం. ఇదే సమయంలో... కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారని అంటున్నారు.

మరోవైపు... ఆ సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ను ట్రూత్ ల్యాబ్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా కావూరి భాస్కర్ రావు.. ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాగా... నాగేశ్వర రావు, రిత్విక్ స్వాతీ కంపెనీ ఉద్దేశ్యపూర్వకంగానే సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆ టెస్టుల్లో కన్ ఫాం అయ్యిందని చెబుతున్నారు. దీంతో.. ఆ విషయాలను కూడా వేణు, భాస్కర్ రావులు హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తుంది.

Tags:    

Similar News