టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ముహూర్తం పెట్టుకున్న బీజేపీ నేత...!
ఆయన 2012 నుంచి 2024 వరకూ రెండు సార్లు ఏకంగా పన్నెండేళ్ళ పాటు పెద్దల సభలో ఉన్నారు అంటే దానికి టీడీపీ కారణం.
ఆయన బీజేపీ నేత. కానీ ఆయన రాజకీయ జీవితం రెండున్నర దశాబ్దాల పైగా టీడీపీతో ముడిపడి ఉంది. ఆయన ఎవరో కాదు సీఎం రమేష్. ఏప్రిల్ 2తో రాజ్యసభ సభ్యత్వం రెండవ సారి ముగియబోతున్న నేత. ఆయన 2012 నుంచి 2024 వరకూ రెండు సార్లు ఏకంగా పన్నెండేళ్ళ పాటు పెద్దల సభలో ఉన్నారు అంటే దానికి టీడీపీ కారణం. చంద్రబాబు దయ ఇంకా కారణం.
ఇక సీఎం రమేష్ రాజకీయ జీవితం 1985లో స్టార్ట్ అయింది. ఆయన 2020 వరకూ అదే పార్టీలో ఉన్నారు. అవసరార్ధం బీజేపీలో ఉన్నా ఆయన టీడీపీని ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. ఇపుడు పొత్తులో ఆయనకు అనకాపల్లి సీటు దక్కడం వెనక కూడా టీడీపీ పెద్దల కటాక్షాలు ఉన్నాయని అంటున్నారు.
ఒక విధంగా చెప్పాలీ అంటే అంగబలం అర్ధబలం కలిగిన సీఎం రమేష్ ని ఉపయోగించుకుని అనకాపల్లి అసెంబ్లీలో అన్ని సీట్లు గెలవాలని టీడీపీ ప్లాన్. దానికి గానూ ఆయనకు స్థానిక పార్టీ యంత్రాంగం పూర్తిగా సహకరించేలా చూస్తున్నారు. అసలు సీఎం రమేష్ కి టీడీపీలో తెలియని వారు కూడా లేరు.
దాంతో అనకాపల్లి ఎంపీ బాధ్యతలను పెద్దన్నగా వ్యవహరించమని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మీద పెట్టారు. సీటు ప్రకటించిన తరువాత రమేష్ మొదటి సారి అనకాపల్లి ఈ నెల 29న వస్తున్నారు ఆ రోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. అంటే బీజేపీలో ఉన్నా టీడీపీకి ఉత్సాహపరిచే రోజునే సీఎం రమేష్ ఎంచుకున్నారు అని అంటున్నారు.
సీఎం రమేష్ కి ఘన స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఇక సీఎం తో డిప్యూటీ సీఎం పోటీ అని అపుడే టీడీపీ ప్రచారం మొదలెట్టేసింది. ఈ స్లోగన్ వల్ల సీఎం ఎక్కువ డిప్యూటీ తక్కువ అన్న భావం జనాలోకి వెళ్ళడమే టీడీపీ కూటమి ధ్యేయం అని అంటున్నారు. సీఎం అంటే ఇంటి పేరు లో సీఎం పదవి ఉంచుకున్న రమేష్ ది. ఇక డిప్యూటీ సీఎం గా ఉన్న బూడి ముత్యాలనాయుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు.
అలా పోటీ పెట్టి సీఎం కనుక ఆయనే విజేత అని కూటమి నేతలు అంటున్నారు. ఇక్కడ మరో చిత్రమైన విషయాన్ని చెప్పుకోవాలి. ఇప్పటిదాకా అనకాపల్లి పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో ఒక్క దానిలోనూ పోటీ చేసిన చరిత్ర బీజేపీకి లేదు. కానీ ఇపుడు ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మొదటి సారి కమలం పువ్వు గుర్తుని పార్లమెంట్ ఎన్నికల్లో చూడబోతున్నాయి. వారందరికీ చెప్పి ఓటేయించాల్సిన బాధ్యత టీడీపీ మీద పడింది. మొత్తం మీద చూస్తే సీఎం రమేష్ ఎలాగైనా గెలిచి అనకాపల్లి నుంచి ఢిల్లీకి వెళ్లాలని చూస్తున్నారు. ఇంకో వైపు చూస్తే అత్యంత ఖరీదు అయిన ఎన్నికగా ఈసారి అనకాపల్లి నిలిచే అవకాశం ఉంది అని అంటున్నారు.