మరో పరీక్షకు సిద్ధమైన కాంగ్రెస్.. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేనా..? బీసీ రిజర్వేషన్ కలిసొచ్చేనా..?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తదుపరి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ గడ్డు పరిస్థితులను చవిచూసింది.

Update: 2024-09-21 16:30 GMT

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తదుపరి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ గడ్డు పరిస్థితులను చవిచూసింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ తెలంగాణలోనూ ఆ పార్టీ ప్రభావం పూర్తిగా కోల్పోయింది. ప్రత్యేక రాష్ట్రం సాధించిన పేరుతో రెండు సార్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే కొలువుదీరింది. దాంతో ఆ పదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ పేరు కూడా వినిపించకుండా పోయింది. పార్టీలోని ముఖ్యనేతలు, కింది స్థాయి నేతలు సైతం పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దాంతో ఉన్న కేడర్‌లో రోజురోజుకూ మనోస్థైర్యం దెబ్బతింది.

అలా.. రెండు టర్మ్‌ల ఎన్నికల్లోనూ పార్టీకి పరాభావం తప్పలేదు. ఇక.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పార్టీ జీవం పోసుకుంది. అనూహ్యంగా పార్టీ ఊపందుకుంది. పార్టీలో రేవంత్ రెడ్డి కీ రోల్ పోషిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ప్రతీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. రాష్ట్రమంతటా పర్యటించారు. అటు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను తీసుకొచ్చి వారితో ప్రచారం చేయించారు. ఫైనల్‌గా ఫలితం సాధించారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో హవా కొనసాగించింది. 8 పార్లమెంట్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చని ఊపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చిందని చెప్పొచ్చు. అయితే.. ఇప్పటికే రెండు బిగ్ టాస్క్‌లను ఎదుర్కొన్న కాంగ్రెస్.. ఇప్పుడు అధికారిక హోదాలో మరో ఎన్నికల టాస్క్‌ను ఎదుర్కోబోతోంది. అవే స్థానిక సంస్థల ఎన్నికలు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద టాస్క్‌ కాబోతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ జిల్లాల్లోనూ మెజార్టీ స్థానాల్లో వన్ సైడ్ తీర్పు వచ్చింది. చాలా పంచాయతీలపై గులాబీ జెండాలే రెపరెపలాడాయి. ఇంకా.. వందల సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అవి కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. అయితే.. గతంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందా..? లేదా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటితేనే పార్టీకి మరింత బలం పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

అయితే.. అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆ పార్టీ చెప్పింది. తన మేనిఫెస్టోలోనూ పొందుపరిచింది. కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల సమయం ముగిసింది. గత జనవరి 31తోనే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దాంతో అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు బీసీ రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థలు నిర్వహించాలని అటు ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఇటు ప్రభుత్వం పెద్దలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలకు పోతామని చెప్పారు. అయితే.. బీసీ రిజర్వేషన్లు అమలైతే రాష్ట్రంలో బీసీలకు స్థానాలు పెరుగుతాయి. బీసీ రిజర్వ్‌డ్ సంఖ్య పెరుగుతుంది. దాంతో ఈ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందా..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ రిజర్వేషన్లను ఆ పార్టీ ఏ మేరకు సద్వినియోగం చేసుకొని.. ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందా..? అని జోరుగా చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News