ఆర్మూర్‌ వద్దు ఎల్బీ నగర్ ముద్దు... ఏమిటీ మ్యాటర్?

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుందని అంటున్నారు.

Update: 2023-08-27 08:02 GMT

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ, బీసీలకు పెద్ద పీట వేయాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఒక్కో పార్లమెంటు స్థానంలోనూ కనీసం రెండు మూడు సీట్లకు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఈ పరిస్థితుల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ సెగ్మెంట్లు బీసీలకు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుయాష్కీ ఆర్మూర్ అసెంబ్లీ నుంచి పోటీచేస్తారని భావిస్తున్నారు. నిన్నటివరకూ కార్యకర్తలు అదే భావనతో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో ఆయన మనసు మారిందని తెలుస్తోంది.

అవును... బీసీలకు ప్రాధాన్యత కోరుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం సైతం తగిన సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇలాంటి సమయంలో రెండుసార్లు ఎంపీగా గెలిచిన పరిధిలో కాకుండా... మరోచోటకు తరలి వెళ్లాలని మధుయాష్కి భావిస్తున్నారట! ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారని అంటున్నారు.

ఈ కారణంగానే యాష్కీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ గా ఉన్నప్పటికీ.. నిజామాబాద్‌ జిల్లా వైపు చూడడం లేదంటూ జిల్లా నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. పార్టీ నాయకత్వం నాలుగు సార్లు ఎంపీ టిక్కెట్టు ఇవ్వగా రెండుసార్లు గెలిపించిన ప్రజలపట్ల ఇలాంటి వైఖరి కరెక్ట్ కాదని అంటున్నారు.

దీంతో... ప్రస్తుతం ఆర్మూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కు సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగకపోగా, అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన మధుయాష్కీ ఇటువైపు ఆలోచన చేయకపోవడమేమిటని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా... ఎన్నారైగా వచ్చి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాష్కీని జిల్లా నుంచి వరుసగా రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించారు నిజామాబాద్ ప్రజలు. అధిష్టానం ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తే, కష్టకాలంలో జిల్లా పార్టీ కార్యకలాపాల విషయంలో ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించారని చెబుతున్నారు.

తాజాగా ఆర్మూర్‌ నుంచి బీసీ నాయకుడిగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, పైగా అతి అతిముఖ్యమైన పరిస్థితి అయినప్పటికీ... తన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఎల్బీ నగర్ వెళ్లడమేమిటని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని సమాచారం. మరి ఈ వ్యవహారంపై అధిష్టాణం ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News