ఆ రెండు సీట్లు కాంగ్రెస్‌కు క‌ష్ట‌మే.. రీజ‌నేంటంటే!

సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పార్టీ నేత పటేల్‌ రమేశ్‌రెడ్డి మ‌రింత తీవ్రంగా పోటీ పడుతున్నారు.

Update: 2023-10-19 08:34 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే 70 స్థానాల దాకా టికెట్లు ప్ర‌క‌టించింది. వీటిలో ఒక‌టి రెండు స్థానాలు మిన‌హా.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం పెద్ద‌గా స‌మ‌స్య రాలేదు. ఇదిలావుంటే, ఇప్ప‌టికీ ప్ర‌క‌టించ‌ని కొన్ని స్థానాల విష‌యంలో కాంగ్రెస్‌కు చిక్కులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని సూర్యాపేట‌, తుంగ‌తుర్తి.. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నేనంటే నేనంటూ.. నాయ‌కులు బ‌రిలో నిలిచారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సూర్యాపేట, తుంగతుర్తిలో పోటీ చేసేందుకు ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏకంగా పాతిక మంది వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేశారు. అంతేకాదు.. వారి బ‌యోడేటా.. రాజ‌కీయ అనుభ‌వం , పార్టీ కోసం చేసిన సేవ వంటి వాటిని నాయ‌కులు ఏక‌రువు పెట్టారు. మ‌రికొంద‌రు త‌మ మందీ మార్బ‌లంతో ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రికి టికెట్ కేటాయించాల‌నే విష‌యం కాంగ్రెస్‌కు కొరుకుడు ప‌డ‌డం లేదు.

సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పార్టీ నేత పటేల్‌ రమేశ్‌రెడ్డి మ‌రింత తీవ్రంగా పోటీ పడుతున్నారు. సూర్యాపేట టిక్కెట్‌ కోసం స్క్రీనింగ్‌ కమిటీలోని సభ్యులు రెండుగా చీలిపోయారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని చివరి విడతలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తుంగతుర్తిలోనూ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కు కత్తిమీదసాములా మారింది.

గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన అద్దంకి దయాకర్‌ మరోసారి పోటీకి తీవ్ర ప్రయత్నం చేస్తుండగా.. ఓయూ విద్యార్థి నాయకులు పిడమర్తి రవి, ప్రీతమ్‌ తదితరులు టిక్కెట్‌ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇంకోవైపు.. అధిష్టానం ఆశీస్సులు త‌మ‌కే ఉన్నాయ‌ని ఒక‌రిద్ద‌రు ప్ర‌చారం చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే.. సూర్యాపేట‌, తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు త‌ల‌కు మించిన భారంగానే మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News